కోదాడ : రాష్ట్రంలో అత్యున్నత సీఎం పదవుల్లో ఉండి జుగుప్సకర వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి ( Revanth reddy ) ని తక్షణమే బర్తరఫ్( Dismissal ) చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదివారం కోదాడ బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై మహాధర్నా( Mahadarna ) నిర్వహించారు. రేవంత్ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ( Bollam Mallaiah Yadav ) మాట్లాడుతూ 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసి సబ్బండ వర్గాలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిన మహానేత కేసీఆర్ ( KCR ) ను, ఉద్యమ నేతలు హరీష్ రావు, కేటీఆర్‌ను దుర్భాషలాడిన రేవంత్ రెడ్డి నాలుక కోసి కారం పెడితేనే పాప పరిహారం అవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం అన్ని రంగాలలో అధోగతిపాలై కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని అన్నారు.
ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇదేమిటని ప్రశ్నించిన ప్రతి వర్గాన్ని వీధి రౌడీలా బెదిరిస్తున్నారని విమర్శించారు. వర్షాభావంతో సాగునీరు అందనీ పరిస్థితిలో అన్నదాతలు గగ్గోలు పెడుతుంటే కాళేశ్వరంలో నీరు ఉన్నా అందించని సైకో ముఖ్యమంత్రని విమర్శించారు. కరువు నేపథ్యంలో కాళేశ్వరం నుంచి సాగునీరు విడుదల చేయవచ్చని విశ్రాంత ఇంజనీర్ల సంఘం బాధ్యులు స్పష్టం చేస్తే వారిని బొక్కలో వేయాలని, థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి మతిభ్రమించి మాట్లాడుతున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రంలో పోలీసుల ఇష్ట రాజ్యం నడుస్తుందని, శాంతిభద్రతలు కరువయ్యాయని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ సాగునీరు అందించి కోటి ఎకరాలను సస్యశ్యామలం చేస్తే, నేడు రైతుల ద్రోహి రేవంత్ రెడ్డి నీటిని సముద్రం పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఉద్యమ నేత కేసిఆర్ కు క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు కోదాడ నుంచే ఉద్యమాన్ని షురూచేస్తామన్నారు.
ఈ ధర్నాలో మండల పట్టణ బాధ్యులు రమేష్, అజయ్ కుమార్, ప్రదీప్, శివాజీ, రామాచారి తాళ్లూరు శ్రీను, నర్సిరెడ్డి, ఆంజనేయులు, శీల సైదులు, ఏలూరు వెంకటేశ్వర్లు, యుగంధర్ రెడ్డి, అప్పారావు, ఎస్.కె నయీమ్, చీమ నరేష్, తుమ్మలపల్లి భాస్కర్, కరీముల్లా బాబా, అబ్బు ఉపేందర్ గౌడ్, చలిగంటి వెంకట్, భాగ్యమ్మ,బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.