హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): దావోస్ పర్యటనలో రాష్ర్టానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇదంతా సీఎం రేవంత్‌రెడ్డి శ్రమేనని, అధికారం చేపట్టిన నెలన్నర రోజుల్లోనే ఇవన్నీ సాధించారని, ఇదో రికార్డని కాంగ్రెస్ పార్టీ విపరీతంగా ప్రచారం చేస్తున్నది. అయితే ఈ ప్రచారం మొత్తం డొల్లేనని రాజకీయ, పారిశ్రామిక నిపుణులు విమర్శిస్తున్నారు. ఏ కంపెనీ కూడా కేవలం ఒకటిరెండు రోజుల చర్చలతో వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించదని గుర్తు చేస్తున్నారు. వాటి వెనుక నెలలపాటు ప్రభుత్వం, అధికారుల శ్రమ ఉంటుందని చెప్తున్నారు. దఫ దఫాలుగా చర్చలు జరుపుతూ ఫాలోఅప్ చేస్తూ ఉంటేనే కంపెనీలు వస్తాయని అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులకు రాష్ట్రం తరపున నేతృత్వం వహించి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించిన విషయం తెలిసిందే.
పలు దఫాల చర్చల అనంతరం అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పుడు దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎంవోయూలు చే సుకొన్న అనేక కంపెనీలతో కేసీఆర్ పాలనలోనే చర్చలు జరిగాయని, గతంలోనే పెట్టుబడుల ప్రకటనలు చేశాయని చెప్తున్నారు. కేసీఆర్ ప్ర భుత్వం హయాంలో పెట్టుబడులకు ముందుకొచ్చి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొన్న పలు కంపెనీలతోనే రాష్ట్ర సర్కారు మళ్లీ ఎంవోయులు కుదుర్చుకొన్నట్టు విమర్శలు వస్తున్నా యి. ఇలాంటి కంపెనీల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో వచ్చిన పెట్టుబడులనే తాము సాధించామని చెప్పుకొనేందుకే కాంగ్రెస్ ప్రభు త్వం ఇలా చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అదానీకి నాడు ఎర్రజెండా.. నేడు ఎర్ర తివాచీ
బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ తెలంగాణలో కాలుమోపేందుకు పదేండ్లుగా అనేక రకాల ప్రయత్నాలు చేశారు. కానీ కేసీఆర్ పాలనలో ఆ అవకాశం ఇవ్వలేదు. ఇతర కార్పొరేట్లతో పోల్చితే అదానీ వ్యాపారశైలి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక్క రూపాయి పెట్టి రూ.10 లాభం పొందాలనే తరహాలో తహతహలాడుతుంటారని మార్కెట్ వర్గాలు చెప్తున్నా యి. ఈ క్రమంలో అనేక నిబంధనలను ఉల్లంఘిస్తుంటారని, కేంద్ర సంస్థలను మేనేజ్ చేసి తప్పించుకుంటారనే విమర్శలు ఉన్నాయి. ఆయనకు కేంద్ర పెద్దల అండ ఉండటం వల్లే ఇది సాధ్యమవుతున్నదనే విమర్శలు ఉన్నాయి. అదానీపై శ్రీలంక మంత్రి చేసిన ఆరోపణలు, ఇం దులో ప్రధాని మోదీని ప్రస్తావించడం వంటివి దేశాన్ని ఓ కుదుపు కుదిపాయి. అదానీ గ్రూప్ మోసాలకు పాల్పడిందంటూ ఏకంగా ‘హిండెన్ బర్గ్’ నివేదిక బయటకు వచ్చి మార్కెట్‌ను కుప్పకూల్చింది.
దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు, పార్లమెంట్ ప్రతిష్టంభన.. ఇలా భారీస్థాయిలో పోరాటాలు జరిగాయి. పైగా అదానీ పెట్టుబడులు ఎక్కడ ప్రారంభమైనా.. చివరికి అది రాష్ట్ర ప్రభుత్వం మోటర్లకు మీటర్లు పెట్టే వరకే వెళ్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి అనుమానాస్పద పరిణామాల నేపథ్యంలో అదానీ ఎంత ప్రయత్నించినా మాజీ సీ ఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. చర్చలకు కంపెనీ ప్రతినిధులు వచ్చినప్పుడు మర్యాదలు చేసి పంపడం మినహా, వా రికి పెట్టుబడులకు అనుమతి ఇవ్వలేదు. అలాం టి అదానీ కంపెనీతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్నది. ఓవైపు ఢిల్లీలో తిడుతూ.. మరోవైపు హైదరాబాద్‌లో పెట్టుబడులకు ఎలా అనుమతి ఇస్తారంటూ ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తున్నది. రేవంత్‌రెడ్డి సీఎం కాగానే అదానీ కుమారుడు హైదరాబాద్‌కు వచ్చి ఆయన్ను కలువడం, దావోస్‌లో ఎంవోయూ కుదుర్చుకోవడంపై మండిపడుతున్నారు. ఢిల్లీస్థాయిలో అదానీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటే.. రాష్ట్రంలో అదానీని పెట్టుబడులకు ఆహ్వానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ
ఈ సంస్థ తెలంగాణలో రూ.9వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు దావోస్‌లో సీఎం రేవంత్ సమక్షంలో ఈ నెల 17న ఎంవోయూ కుదుర్చుకొన్నది. ఈ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెడతామని 2022లోనే ప్రకటించింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1,500 మెగావాట్ల సామర్థ్యంతో హైడ్రో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును ‘కుమ్రం భీం పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు’ పేరుతో ఏర్పాటు చేస్తామని చెప్పింది. 2022 ఏప్రిల్ 22న ప్రగతిభవన్‌లో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో సంస్థ ప్రతినిధులు ఒప్పందం చేసుకొన్నారు. నిరుడు జనవరి 13న నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముంబైలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్‌తో సమావేశమై, పెట్టుబడులపై చర్చించారు. ‘తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు కేటీఆర్ చేస్తున్న కృషికి, తపనకు ముంబైలో తమ మధ్య జరిగిన సమావేశమే నిదర్శనం’ అని జిందాల్ స్వయంగా ట్వీట్ కూడా చేశారు.
గోద్రెజ్ ఆగ్రోవెట్
ఈ సంస్థ తెలంగాణలో రూ.270 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్టు, ఈ మేరకు దావోస్ వేదికగా ఎంవోయూ కుదిరిందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. గోద్రెజ్ ఆగ్రోవెట్ కంపెనీ ఇప్పటికే ఖమ్మంలో రూ.300 కోట్లతో పామాయిల్ ప్లాంటు ఏర్పాటుకు బీఆర్ఎస్ సర్కారుతో ఒప్పందం చేసుకొన్నది. ప్లాంట్ నిర్మాణానికి నిరుడు సెప్టెంబర్ 30న అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దీనికే పరిమితం కాబోమని, డెయిరీ, ఫార్మా, ఫర్నిచర్, రియల్ ఎస్టేట్, రిటైల్, ఫౌల్ట్రీ, జంతువుల దాణా, పర్సనల్ కేర్ ఉత్పత్తుల విభాగాల్లోకి విస్తరిస్తామని అప్పట్లోనే కంపెనీ ప్రతినిధులు చెప్పారు. సీఎం రేవంత్ ఈ నెల 9న గోద్రెజ్ సంస్థ ప్రతినిధులను సచివాలయానికి పిలిపించుకొన్నారు. పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించినట్టు ప్రకటించారు. తాజాగా దావోస్‌లో ఎంవోయూ కుదుర్చుకొన్నారు.
వెబ్‌వర్క్స్
ఈ సంస్థ రూ.5,200 కోట్లతో ఎంవోయూ కుదుర్చుకొన్నదని కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ప్రకటించుకొన్నది. వాస్తవానికి హైదరాబాద్‌లో వెబ్‌వర్క్స్ ఇప్పటికే డాటా సెంటర్‌ను ఏర్పాటు చేసింది. డాటా సెంటర్ ఏర్పాటుకు 2022 సెప్టెంబర్ 3న అప్పటి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నది. ‘తెలంగాణలో డాటా సెంటర్స్ పాలసీ మా కంపెనీ కార్యకలాపాలు విస్తరించడానికి అద్భుతంగా సహాయం చేస్తున్నది’ అని కంపెనీ సీఈవో నిఖిల్ అప్పట్లో పేర్కొన్నారు. మొదటి దశను వెబ్‌వర్క్స్-ఐరన్ మౌంటెయిన్ సంయుక్తంగా నిరుడు మేలో ప్రారంభించాయి. త్వరలో విస్తరణ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పాయి. తాజాగా డాటా సెంటర్ ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకొన్నది.
ఓ9 సొల్యూషన్స్
ఈ సంస్థ ప్రకటన సైతం ఇదే తరహా. తెలంగాణలో ఇప్పటికే ఆ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. నిరుడు ఆగస్టు 28న సంస్థ సీఈవో చక్రి గొట్టెముక్కలతో నాటి మంత్రి కేటీఆర్ అమెరికాలోని చికాగోలో సమావేశం అయ్యారు. చర్చల అనంతరం హైదరాబాద్‌లో తమ ఆర్ అండ్ డీ కార్యకలాపాలను విస్తరిస్తామని ఓ9 సొల్యూషన్స్ ప్రకటించింది. ఈ మేరకు తాజాగా దావోస్‌లో ఒప్పందం చేసుకొన్నది. సైప్లె చైన్ స్కిల్స్ అకాడమీ ఏర్పాటుకు ముందుకొచ్చింది.