SLBC Tunnel | హైదరాబాద్, ఫిబ్రవరి26 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) ప్రాజెక్టును 2005లో ప్రారంభించి 60 నెలల్లో పూర్తిచేయాలని తొలుత లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి 43.93 కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకం పనులను రెండు వైపుల నుంచి ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడక ముందు, ఏర్పడిన తర్వాత చేపట్టిన పనులతో కలిపి ఇప్పటివరకు 34.372 కి.మీ సొరంగం తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.560 కిమీ మేర సొరంగాన్ని తవ్వాల్సి ఉన్నది. టీబీఎం టెక్నాలజీ, కాంట్రాక్ట్ ఏజెన్సీ సతాయింపులు.. క్షేత్రస్థాయిలోని సవాళ్లు పనుల జాప్యానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క బీఆర్ఎస్ ప్రభుత్వ హయాలోనే 11.482 కిలోమీటర్ల మేర పనులు జరిగాయి. ఆనాడు కాంట్రాక్టు సంస్థ విద్యుత్తు బిల్లుల చెల్లింపు జాప్యంతో పనులకు అడ్డంకిగా మారింది. దీంతో నాటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లించేలా ఏకంగా క్యాబినెట్లోనే తీర్మానం చేసి పనుల జాప్యానికి చెక్‌పెట్టారు. ఇలా క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను అధిగమించి బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేసినా, అసలు పనులే చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కేవలం ప్రస్తుతం ప్రమాద ఘటన నుంచి బయటపడేందుకే మరో కుట్రకు తెరలేపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పేరు కోసం హడావుడి చేసి పనులను ప్రారంభించి ఇప్పుడు గత సర్కారు వైఫల్యమంటూ ఆరోపణలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు.
సవాళ్లను అధిగమించిన నాటి బీఆర్ఎస్ సర్కార్
బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వకం పనుల్లో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ అధికారంలోకి రాకమునుపే అప్పటివరకూ చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యం వల్ల కాంట్రాక్ట్ సంస్థ మొండికేసింది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి రాగా, ఇటు ప్రభుత్వం, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి కాంట్రాక్టు సంస్థతో చర్చించారు. వెంటనే పనులు చేపట్టేందుకు 2015లో కాంట్రాక్టు సంస్థకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.100 కోట్లను అడ్వాన్స్‌గా చెల్లించింది. పనులు కొనసాగుతుండగానే మరోసారి బీఆర్ఎస్ సర్కార్ మరో రూ.100 కోట్లను కూడా అడ్వాన్స్‌గా చెల్లించింది. ఇలా ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమించి సర్కార్ పనులను ముందుకు తీసుకెళ్లింది. టీబీఎం సొరంగాన్ని తవ్వే సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం, కార్మికుల పనిసామర్థ్యం తగ్గిపోవడం, సీపేజీ ఎక్కువ రావడం ఆనాడు సవాళ్లుగా నిలిచాయి. గంటకు 2.5 మీటర్లు బోరింగ్ చేయాల్సిన టీబీఎం సామర్థ్యం రోజుకు గరిష్ఠంగా 5 మీటర్లు కూడా దాటని పరిస్థితి ఏర్పడింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇన్లెట్ టన్నెల్లోకి 2018న భారీగా నీరు వచ్చి చేరింది. ఫలింతంగా బోరింగ్ ప నులు ఆగిపోయాయి. డీవాటరింగ్ సిస్టమ్‌ను మెరుపరచి డిసెంబరు 2019 వరకు నీటిని తొలగించారు. కాంట్రాక్టు ఏజెన్సీకి అప్పటివరకు చెల్లిస్తున్న డీవాటరింగ్ చార్జీలను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే సవరించి పెంచింది. దీంతో డీవాటరింగ్ తర్వాత బోరింగ్ వర్ ప్రారంభమైంది.
నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రత్యేక చొరవ
ఆనాడు కాంట్రాక్టు సంస్థ కరెంటు బిల్లులను సక్రమంగా చెల్లించకపోవడం, టీఎస్ఎస్పీడీసీఎల్ విద్యుత్తు సరఫరాను నిలిపివేయడం, ఫలితంగా డీవాటరింగ్ నిలిచి టీబీఎం పాక్షికంగా మునిగి పనులు నిలిచిపోవడం పరిపాటిగా మారింది. దీంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో కాంట్రాక్టు ఏజెన్సీ చెల్లించే కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆ బిల్లును ఏజెన్సీకి చెల్లించే బిల్లుల నుంచి మినహాయించుకుంటుందని, కరెంటు సరఫరాను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించొద్దని టీఎస్ఎస్పీడీసీఎల్కు స్పష్టమైన ఆదేశాలను జారీచేశారు. దీనికోసం క్యాబినెట్లో ఆమోదం కూడా తీసుకున్నారు. ఇది రాష్ట్ర ప్రాజెక్టుల చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. విదేశాల నుంచి నిపుణులను రప్పించి టీబీఎంను పునరుద్ధరించి 2023లో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. అయితే ప్రస్తుతం సొరంగం తవ్వుతున్న ప్రాంతంలో షియర్ జోన్ నుంచి భారీ సీపేజీ రావడాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టేవరకూ పనులను నిర్వహించవద్దని నిర్ణయించారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అవుట్లెట్ పనుల్లోనూ అడ్డంకులను అధిగమించారు.
ఇంజినీర్ల సూచనలు పెడచెవిన పెట్టిన సర్కార్
ఇన్‌లెట్‌లో పనులు చేపట్టడం కత్తిమీది సాములాంటిందని ఇంజినీర్లు చెప్పినా, సర్కారు మాత్రం పెడచెవిన పెట్టిందని విమర్శలున్నాయి. పనులు చేయాల్సిందేనంటూ కాంట్రాక్ట్ సంస్థపై ఒత్తిడి చేస్తూ, మెడమీద కత్తి పెట్టినంత పనిచేసిందని ఇంజినీర్లే చెప్తున్నారు. పటిష్ఠ రక్షణ చర్యలు, గ్రౌటింగ్ నిర్వహించకుండా పనులను ముందుకు తీసుకెళ్లడం వల్లే ప్ర స్తుతం మట్టి, సిమెంట్ కప్పులు కూలిపోయాయని తెలిసింది. సర్కారు తొందరపాటు, ప్రచార యావ, ఏజెన్సీ నిర్లక్ష్యం మూలంగానే సొరంగం కూలిందని ఇంజినీరింగ్ నిపుణులు చర్చించుకుంటున్నారు. సీఎం అబద్ధం
‘ఎస్ఎల్బీసీ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్) పనులు కాంగ్రెస్ పాలనలోనే 30 కిలోమీటర్ల మేర పూర్తయింది. మధ్యలో గత పదేండ్ల నుంచి పనులు చేయకపోవడం వల్ల యంత్ర పరికరాలూ పాడయ్యాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిచేస్తాం’ ఇవి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన ఆరోపణ.
బీఆర్ఎస్ నిజం
బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులు నిర్విఘ్నంగా ముందుకు సాగాయి. మొత్తంగా 43.93 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకంలో భాగంగా రాష్ట్ర ఏర్పాటు నాటికి పూర్తయింది కేవలం 22 కిలోమీటర్లే. ఆ తర్వాత గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 11.48 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మాణాన్ని పూర్తిచేసింది. తెలంగాణ ఏర్పడే వరకు గత ప్రభుత్వాలు అంటే 2014 జూన్ నాటికి రూ.1,279.04 కోట్లను వెచ్చించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదిన్నరేండ్లలో రూ.1,364.46 కోట్లను ఖర్చుచేసింది.
ఎస్ఎల్బీసీ సొరంగం నిర్మాణ వివరాలు (కి.మీ,)
మొత్తం సొరంగం లక్ష్యం 43.93