కరీంనగర్ కార్పొరేషన్, సెప్టెంబర్ 1: అన్ని వర్గాలు, మతాల అభ్యున్నతి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కోరారు. ఎన్నికలు సమీపిస్తున్నందున కొన్ని శక్తులు తప్పుడు వాగ్ధానాలతో వస్తున్నాయని, వాటిని నమ్మి అధికారం అప్పగిస్తే తెలంగాణ సంపదను దోచుకుంటాయని దుయ్యబట్టారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలంటే బీఆర్ఎస్ను కొనసాగించాలని కోరారు.
కనుమరుగైన కుల వృత్తులు, చేతివృత్తులను కాపాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారని చెప్పారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ కుల, చేతివృత్తులకు సంబంధించి 705 మందికి రూ.లక్ష చొప్పున చెక్కు లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కులవృత్తులకు సరైన ఆదరణ లేకపోవడంతో ఉపాధి కరువై ఉన్న ఊరిని, నమ్ముకున్న వృత్తిని వదిలి బొం బాయి, ఇతర ప్రాంతాలకు వలసపోయి కూలీ పనులు చేసుకునే పరిస్థితులు ఉండేవన్నారు. దళిత బంధు ద్వారా లబ్ధిపొంది క్లీనర్లు ఓనర్లుగా మారిన విధంగానే బీసీ చేయూతతో వరర్ టు ఓనర్ కావాలని ఆకాంక్షించారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ప్రతి నెలా లబ్ధిదారులకు చెకులను అందించనున్నట్టు పేర్కొన్నారు.