పెనుబల్లి, మే 18: తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారేనని ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్ స్పష్టంచేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ గెలుస్తుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి ఆదివారం వచ్చిన ఆయన.. పెనుబల్లిలో తన చిరకాల మిత్రుడైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోటగిరి సుధాకర్‌బాబును కలిశారు. ఈ సందర్భంగా అక్కడే మీడియాతో మాట్లాడారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. తమకెవరూ అప్పులివ్వడం లేదంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రే తన స్థాయిని మరిచి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే తమకు నడుస్తలేదంటూ రోజూ అవే మాటలు వల్లించడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసమే అప్పులు చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి ఆనవాళ్లు, సంక్షేమ పథకాలు ఇప్పటికీ కండ్లముందే కన్పిస్తున్నాయని తెలిపారు.