హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : ‘ఇప్పుడు కావాల్సింది అధికార స్వరాలు కాదు.. ధికార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలి.. విద్యార్థులు, యువతకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా పోరాడేవాళ్లు కావాలి.. యువకుడు, విద్యావంతుడు, ఉత్సాహవంతుడు ప్రశ్నించే తత్వం ఉన్న రాకేశ్‌రెడ్డిని శాసనమండలికి ఎన్నుకోవాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్- ఖమ్మం – నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ బీఆర్ఎస్ గెలిచిందని, ఈసారి కూడా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన తీరును ఈ మూడు జిల్లాల్లో ఉన్న 4.70 లక్షల నిరుద్యోగ యువత గుర్తించాలని కోరారు.
21 వేల పోస్ట్‌లతో మెగా డీఎస్సీ అని చెప్పిన కాంగ్రెస్ దగా డీఎస్సీ చేసిందని విమర్శించారు. తాము గతంలో ఇచ్చిన డీఎస్సీ పోస్టులకు మరో ఐదు వేల పోస్టులు కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. జాబ్ క్యాలెండర్‌పై ఇప్పటికీ తేల్చలేదని, టెట్‌కు ఎలాంటి ఫీజులు తీసుకోబోమని చెప్పి ఇప్పుడు ప్రతి విద్యార్థి నుంచి రూ.2వేలు వసూలు చేసిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ జిల్లాలోనే మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు 73 శాతం అత్యధిక పే సేల్ ఇచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, రెండు లక్షల ఉద్యోగ నియామకాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు అబద్ధాలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి యువత బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారని, ఇప్పటికే ఐదు నెలలు పూర్తయ్యాయని గుర్తుచేశారు. కల్లబొల్లి మాటలతో మోసం చేసిన కాంగ్రెస్ తీరును యువకులు ఎండగట్టాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రశ్నించాలని, తమ అభ్యర్థిని గెలిపిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారని చెప్పారు.
బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి బిట్స్ పిలానీలో ఇంజినీరింగ్, పీజీ చేశారని, అమెరికాలో ఐటీ రంగంలో ఏడేండ్లు పనిచేశారని, ఆయన విద్యావంతుడు, ఉత్సాహవంతుడని కేటీఆర్ చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసేదాకా ప్రశ్నించే తత్వం ఉన్న రాకేశ్‌రెడ్డిని శాసనమండలికి ఎన్నుకోవాలని కోరారు. గతంలో నల్లగొండలో నయీంను చూశామని, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటేసి శాసనమండలికి పంపితే నయీం లాంటి వ్యక్తిని తయారు చేసిన వారమవుతామని చెప్పారు. ఒక బ్లాక్ మెయిలర్, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని వ్యక్తి, ఎప్పుడు ఎవరిని తిడుతాడో తెలియని వ్యక్తిని ఎన్నుకుంటే ఏం చేస్తాడో అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై తెలంగాణ భవన్లో మొదట మూడు ఉమ్మడి జిల్లాల సమావేశాలు నిర్వహించారు. సమావేశంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థులు నామా నాగేశ్వర్రావు, మాలోత్ కవిత, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తాతా మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.