మెట్పల్లి రూరల్, ఏప్రిల్ 14 : జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్ సభతో కాంగ్రెస్ పాలన అంతం కానున్నదని కేసీఆర్ సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరూ ‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని కోరుకుంటున్నారని చెప్పారు. కోరుట్ల నియోజకవర్గం నుంచి 15 వేలకు తగ్గకుండా జనసమీకరణ చేపట్టి సభను జయప్రదం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే డాక్ట ర్ సంజయ్ కల్వకుంట్ల ఆధ్వర్యంలో మం గళవారం మెట్పల్లి మండలం వెల్లుల్ల శివారులో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించగా ప్రశాంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి అధికార పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరనుండటం రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు శ్రీకారమని చెప్పారు. కాంగ్రెస్ పాలన దొరికినంత దోచుకో.. దాచుకో అన్న చందంగా తయారైందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి మూసీనది ప్రక్షాళన పేరిట 3వేల ఎకరాలకు సూటి పెట్టారని దుయ్యబట్టారు. సింగరేణి మైనింగ్‌ను అయిన వాళ్లకు కట్టబెడుతున్నారని, అంగన్వాడీలకు ఇచ్చే ఫోన్లలో అవినీతి చేశారని ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్న కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు తనపై కేసులు పెట్టారని పేర్కొన్నారు.