జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 1 : సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తానని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శనివా రం జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించే ‘లక్ష డప్పులు.. వేల గొంతులు’ సాంస్కృతిక మహా ప్రదర్శన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మం ద కృష్ణ, విశిష్ట అతిథిగా జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాదిగ, ఉప కులాల ప్రతినిధులు పద్మశ్రీ గడ్డం సమ్మయ్య, డాక్టర్లు సీహెచ్ రాజమౌళి, సుగుణాకర్‌రాజు, వంశీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు కో సం నాటి ఉద్యమ నేత కేసీఆర్ గొంగళి పురుగునైనా ముద్దాడుతానని చెప్పి అన్ని పార్టీల మద్దతు కూడగట్టి విజయం సాధించారని, అదే రీతిలో తాను కూడా ఎస్సీ వర్గీకరణకు దే శంలో అనుకూలంగా ఉన్న రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టానని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. వర్గీకరణ న్యాయమైన డిమాండ్‌గా భావించిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గత అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంట్‌కు పంపారని గుర్తు చేశారు.