Harish Rao | ఐదు గుంటల భూమి ఉన్న వ్యవసాయ కూలీకి రూ.1500 రైతు భరోసా వస్తే.. ఆత్మీయ భరోసాకింద రూ.10,500 నష్టపోవాల్సి వస్తది. పది గుంటల భూముల ఉన్నోళ్లకు రూ.3 వేలు రైతు భరోసా వస్తే.. ఆత్మీయ భరోసా కింద రూ.9 వేలు నష్టపోతరు. అరెకరం భూమి ఉన్నోళ్లు రూ.6 వేలు, 30 గుంటల భూమి ఉంటే రూ.3వేలు నష్టపోవాల్సి వస్తది. -హరీశ్‌రావు
సంగారెడ్డి జనవరి 13(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ వ్యవసాయ కూలీలకు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క శఠగోపం పెడుతున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందరికీ వర్తింపజేస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 10 శాతం మందికే ఇచ్చేందుకు కుట్రపన్నుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉండగా 1.02 కోట్ల మంది వ్యవసాయ కూలీలు పని చేస్తున్నట్టు చెప్పారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు కోతలు పెట్టేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సెంటు భూమి ఉన్నా, 20 రోజులు పనులకు పోకున్నా ఇందిరమ్మ భరోసా పథకం వర్తింపజేయబోమని ప్రభుత్వం నిబంధనలు పెడుతున్నదని హరీశ్ మండిపడ్డారు. ఐదు గుంటల భూమి ఉన్న వ్యవసాయ కూలీకి రైతుభరోసా కింద రూ.1500 వస్తే ఆత్మీయ భరోసా పథకం కింద రూ.10,500 నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. పది గుంటల భూమి ఉంటే రైతుభరోసా డబ్బు రూ.3 వేలు లభిస్తే ఆత్మీయ భరోసా పథకం కింద రూ.9 వేలు నష్టపోతారని తెలిపారు. 90 లక్షల మందికి ఆత్మీయభరోసా పథకం ఎగ్గొడుతున్నందుకు రేవంత్, భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అందరికీ అమలు చేయకుంటే వ్యవసాయ కూలీలు తిరగబడతారని, పథకం అమలుకు గ్రామసభలు పెడితే అధికారులపైకి తిరగబడతారని హెచ్చరించారు. ఎకరం లోపు భూమి ఉన్నవారందరినీ వ్యవసాయ కూలీలకుగా గుర్తించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
గోబెల్స్‌ను మించిపోయిన భట్టి
అబద్ధాలు చెప్పడంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గోబెల్స్‌ను మించిపోతున్నారని హరీశ్ ఫైర్ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, ఒక్క ఎకరాకూ నీళ్లివ్వలేదని భట్టి విక్రమార్క మాట్లాడటంపై హరీశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రాజెక్టులు, సాగునీటిపై బహిరంగ చర్చకు రావాలని భట్టికి సవాల్ విసిరారు. మదిర, ఖమ్మం, సెక్రటేరియట్, ప్రగతి భవన్ ఇలా ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని స్పష్టంచేశారు. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే రూ.4 వేల కోట్లతో ప్రాజెక్టులు కట్టి 6.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చినట్టు తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో రూ.4.07 లక్షల కోట్లు అప్పు చేస్తే భట్టి విక్రమార్క రూ.6 లక్షల కోట్లు అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిన ఆర్డీఎస్ను బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తిచేసిందని, మహబూబ్‌నగర్ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల్లో నీటి పరుగులు పెట్టించి 6.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చామని గుర్తుచేశారు. సాగునీటి విషయంలో తప్పుగా మాట్లాడిన భట్టి విక్రమార్క వెంటనే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేదంటే తనతో బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
రుణమాఫీ చెక్కుకు పతారా లేదు
సీఎం రేవంత్‌రెడ్డి రుణమాఫీ కోసం ఇచ్చిన రూ.2750 కోట్ల చెక్కుకు పతారా లేకుండా పోయిందని హరీశ్ ఎద్దేవా చేశారు. పంట రుణమాఫీ కోసం రేవంత్‌రెడ్డి రెండు నెలల క్రితం రూ.2750 కోట్ల చెక్కు ఇస్తే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బు జమకాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో డమ్మీ హామీలు ఇచ్చినట్టుగానే రేవంత్‌రెడ్డి డమ్మీ చెక్కు ఇచ్చారా? అని ప్రశ్నించారు. రైతులను అన్ని విధాలా ముఖ్యమంత్రి దగా చేస్తున్నారని మండిపడ్డారు. సంక్రాంతికి ఊళ్లకు వెళ్లిన అన్నలు, తమ్ముళ్లు, అక్కలు గ్రామాల్లో రైతులతో మాట్లాడాలని కోరారు. కేసీఆర్ పాలన ఎలా ఉన్నదో?, రేవంత్ పాలన ఎలా ఉన్నదో బహిరంగ చర్చ పెట్టాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, జైపాల్‌రెడ్డి, మఠం భిక్షపతి, ఎం ఏ హకీం, విజయేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
గిరిజన, దళిత, బీసీ కూలీల నోళ్లు కొట్టేందుకు రేవంత్, భట్టి విక్రమార్కకు చేతులెట్ల వస్తున్నయ్? 90 లక్షల మందికి ఆత్మీయ భరోసా పథకం ఎగ్గొడుతున్నరు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఎగ్గొడుతున్నందుకు రేవంత్, భట్టి విక్రమార్క క్షమాపణ చెప్పాలె. ఈ పథకం అందరికీ వర్తింపజేయకుంటే వ్యవసాయకూలీలు తిరగబడటం ఖాయం.. పథకంపై గ్రామసభలు పెడితే అధికారులపైకి వ్యవసాయ కూలీలు తిరగబడుతరు.
-హరీశ్‌రావు
రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్ కార్డులు ఉన్నయి. 1.02 కోట్ల మంది వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నరు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో కోతలు పెట్టేందుకు సిద్ధమైంది. సెంటు భూమి ఉన్నా, 20 రోజులు పనులకు పోకున్నా ఆత్మీయ భరోసా వర్తింపజేయబోమని నిబంధనలు పెడుతున్నది.
-హరీశ్‌రావు
కేసీఆర్ హయాంలో మహబూబ్‌నగర్‌లో ఎన్ని ప్రాజెక్టులు నిర్మించామో.. ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చామో లెక్కలతో వస్తా.. మదిర, ఖమ్మం, సెక్రటేరియట్, ప్రగతి భవన్ ఎక్కడికి రమ్మన్నా సరే.. బహిరంగ చర్చకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రావాలె.. లేదంటే ప్రజలకు క్షమాపణలు చెప్పాలె.
-హరీశ్‌రావు