Telangana Bhavan | హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): ఉద్యమ సమయంలో తెలంగాణ ఆకాంక్షల సౌధంగా నిలిచిన తెలంగాణభవన్.. నేడు ప్రజల కష్టాలను పంచుకొని, వారి సమస్యల పరిష్కారానికి దారిచూపే నిలయంగా మారుతున్నది. తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్తో ఉన్న భావోద్వేగ బంధానికి గురువారం నాటి పరిణామాలే నిదర్శనం.
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలోని అధికార బీజేపీకి ఎనిమిదేసి సీట్ల ఇచ్చిన ప్రజలే ఇప్పుడు ఆ పార్టీలను ఈసడించుకుంటున్నారని చెప్పడానికి తెలంగాణభవన్‌లో కనిపిస్తున్న దృశ్యాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ వర్గాల బాధితులు తమ గోడు వెళ్లబోసుకోవడానికి తెలంగాణభవన్‌కు తరలివస్తున్నారు. రైతులు, ఉద్యోగార్థులు, హైడ్రా బాధితులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ భవన్ తలుపులు తడుతున్నారు.
ఆవేదనాభరితం
తెలంగాణభవన్ గురువారం బీఆర్ఎస్వీ ప్రతినిధులతో కోలాహలంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆహ్వానిత సభ్యులతో ఏ స్థాయిలో కిక్కిరిసిపోయిందో, అదేస్థాయిలో ఆయా బాధిత వర్గాలతో ఆవేదనాభరితమైంది. జీవో-29తో తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులు ఆవేదన చెందారు.
22 రకాల సమస్యలతో హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగానే నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను రీషెడ్యూల్ చేయాలంటూ బుధవారం రాత్రి అశోక్‌నగర్‌లో ఆందోళన నిర్వహించిన వారిని పోలీసులు అరెస్టు చేశారని, వారి విడుదలకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంతోపాటు తమకు న్యాయ సాయం అందించాలని కేటీఆర్‌ను కోరేందుకు వందలాదిగా తెలంగాణభవన్‌కు తరలివచ్చారు.
తమకు రూ.19 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 10 నెలలైనా మాట నిలుపుకోలేదని ఆశావర్కర్లు.. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు మొహం చాటేశారంటూ ఆటోడ్రైవర్లు.. చెప్పాపెట్టకుండా సర్కార్ హైడ్రా పేరుతో తమ కష్టార్జితాన్ని నేలకూలుస్తున్నదని ఇండ్లు కోల్పోయిన బాధితులు.. ఇలా ఒక్కరోజే నాలుగు వర్గాల బాధితులవెతలతో తెలంగాణభవన్ గంభీరంగా మారింది.
వచ్చిన ప్రతి వర్గానికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ చెప్పిన మాటలను కేటీఆర్ గుర్తుచేస్తూ ఎన్నికల్లో ఓట్లు సీట్లు ముఖ్యం కాదని, తెలంగాణ ప్రజల కష్టసుఖాల్లో భాగం పంచుకోవడం బీఆర్ఎస్ డీఎన్ఏలోనే ఉన్నదని స్పష్టం చేశారు. అన్నివర్గాలకు అండగా ఉంటామని అభయమిచ్చారు.
ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్
ఆటో డ్రైవర్లకు ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నవంబర్ 5న తలపెట్టిన ‘ఆటో డ్రైవర్ల మహాధర్నా’ పోస్టర్‌ను కేటీఆర్ గురువారం నందినగర్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ సర్కార్ పరిష్కారం చూపకపోవడం బాధకరమని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మారయ్య పేర్కొన్నారు. ధర్నాకు ఆటో డ్రైవర్లు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.