న్యూస్‌నెట్‌వర్క్, డిసెంబర్ 5 : కాంగ్రెస్ సర్కార్ తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యేలు టీ హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్టుకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేసి సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. గురువారం సాయంత్రం కరీంనగర్‌లోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు తదితరులు పాల్గొని సర్కార్ తీరుపై మండిపడ్డారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ వద్ద రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగా రు. వీణవంకలో సీఎం రేవంత్‌రెడ్డి బొమ్మను దహనం చేయగా.. పోలీసులు అడ్డుకొని మం టలను ఆర్పారు. ఇల్లంతకుంటలో బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు.
మెదక్ జిల్లా న ర్సాపూర్‌లో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సిద్దిపేట పట్టణంలో హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ సర్కారు తీరుపై మండిపడ్డారు. హుస్నాబాద్‌లోని అక్కన్నపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించగా, కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీవో రామ్మూర్తి వాహనాలు 20 నిమిషాలపాటు ట్రాఫిక్‌లో నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ని యోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించారు. సంగారెడ్డి కొత్త బస్టాండు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, ఇల్లెందు, దుమ్ముగూడెం, చర్ల మండల కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ధర్నాకు దిగారు. హనుమకొండ జిల్లా కేయూ మొదటి గేట్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.