హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ):వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ఎల్పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా నాయిని రాజేందర్ వ్యవహరించిన తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకొకరు వెయ్యి కోట్లు సంపాదించారని నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సభా సంప్రదాయాల ప్రకారం సభ్యుడు మాట్లాడేటప్పుడు ఇతర సభ్యులపై వ్యక్తిగత ఆరోపణలు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయొద్దని నిబంధనలు ఉన్నా, స్పీకర్‌కు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎవరిపైనా అవహేళనాత్మక లేదా దూషణల ఆరోపణలు చేయకూదని సభా నియమావళి స్పష్టం చేప్తున్నా రాజేందర్‌రెడ్డి వాటిని అతిక్రమించారని బీఆర్ఎస్ ఎల్పీ తన ఫిర్యాదులో పేర్కొన్నది. సభలో నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని బీఆర్ఎస్ కోరింది.