హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో జరిగిన చర్చ వాడీవేడిగా సాగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు చేసిన ఆరోపణలను మాజీమంత్రి హరీశ్‌రావు దీటైన సమాధానాలతో తిప్పికొట్టారు. హరీశ్‌రావు మాట్లాడుతున్నప్పుడు పదేపదే సీఎం, మంత్రులు కలగజేసుకుంటూ అంతరాయం కలిగించారు. రాజకీయ ఆరోపణలు చేస్తూ, కవ్వించే ప్రయత్నం చేశారు. హరీశ్‌రావు మాత్రం ఎక్కడా డైవర్ట్ కాకుండా పాయింట్ టు పాయింట్ ఆన్సర్స్ చెప్పారు. కాళేశ్వరం పట్ల అవగాహన రాహిత్యం, బురద రాజకీయం చేయాలనే ప్రయత్నంతో మంత్రులు తెలివితేటల స్థాయిని బయటపెట్టుకుని అభాసుపాలయ్యారని గులాబీ శ్రేణులు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు మంత్రుల వ్యా ఖ్యలు, హరీశ్ సమాధానం పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయని ఉదహరిస్తున్నారు.
మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని తీసుకుని మాట్లాడారు. ఈ క్రమంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మేడిగడ్డ బరాజ్‌పై మాట్లాడటంతో… హరీశ్‌రావు దీటైన కౌంటర్ ఇచ్చారు. బరాజ్‌ను కుట్రపూరితంగానే తమ్మడిహట్టి నుంచి మేడిగడ్డకు తరలించారని ఉత్తమ్ పేర్కొన్నారు. రూ.38వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును రూ.1.47లక్షల కోట్లకు పెంచడానికి కారణమేంటనే కోణంలో పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపిందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ ఆరోపణలపై హరీశ్‌రావు ఘాటుగా స్పందిస్తూ… రిటైర్డ్ ఇంజినీర్ల ఫస్ట్, సెకండ్ రిపోర్టులను ఉత్తమ్‌కు తాను పంపుతా అని చెప్పారు. హరీశ్‌రావు అడిగితేనే రిటైర్డ్ ఇంజినీర్ల రిపోర్టును కమిషన్‌కు ఇచ్చినట్టు 650 పేజీల రిపోర్టులో కూడా స్పష్టంగా ఉందని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తప్పుడు ప్రచారాలు ఆపాలని సూచించారు. ఎక్స్పర్ట్ కమిటీ మేడిగడ్డ దగ్గర ఫ్రీజెబుల్ అని చెప్పిందని, మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు సాధ్యం కాదని పేర్కొందని వెల్లడించారు. తమ్మిడిహట్టి వద్ద నీళ్లు లేకపోవడంతోనే బరాజ్‌ను మేడిగడ్డకు మార్చారని ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్టును ఘోష్ కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని, కాంగ్రెస్ వాదనను పరిగణలోకి తీసుకుందని, అందుకే అది ‘పీసీసీ కమిషన్’ అంటున్నామని హరీశ్ చెప్పారు.
హరీశ్‌రావు మాట్లాడుతుండగా.. ఉత్తమ్ కల్పించుకుని కొన్ని రికార్డులను బీఆర్ఎస్ నాయకులు మార్చారని ఆరోపించారు. ఫైవ్ మెన్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్టును ఆన్ రికార్డులో తీసుకోలేదని ఈఎన్సీ మురళీరావు ఘోష్ కమిషన్ లేఖ ద్వారా ఇచ్చారన్నారు. ఈ ఆరోపణలపై హరీశ్‌రావు బదులిస్తూ.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఉత్తమ్ స్వీపింగ్ రీమార్క్స్ చేయడం తగదని హితవు పలికారు. తమ సూచన మేరకే బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు బరాజ్‌ను మార్చిందని ఎక్స్పర్ట్స్ కమిటీ స్పష్టంగా వెల్లడించిందన్నారు. అయినా కమిషన్ ఆ వాదనను పరిగణలోకి తీసుకోలేదంటే ఘోష్ కమిటీ రిపోర్టు ముందే తయారయిందని తేటతెల్లమైందన్నారు. అలాగే డీపీఆర్ లేకుండా టెండర్లు పిలుస్తారా అన్న ఉత్తమ్ ప్రశ్నలకు కూడా హరీశ్ గట్టి సమాధానం ఇచ్చారు. 2007-08లో ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మంత్రులుగా ఉన్నారని, ప్రాణహిత-చేవెళ్లకు 28 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. ప్రాణహిత ప్రాజెక్టుకు 2010లో డీపీఆర్ వచ్చిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. డీపీఆర్, మహారాష్ట్ర అనుమతి లేకుండా 28 ప్యాకేజీలకు టెండర్లు పిలిచి, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి.. సమయాన్ని వృథా చేసింది కాంగ్రెస్ సర్కారేనని విమర్శించారు. ఈ విషయంలో నాడు కాగ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు వెల్లడించారు.
శాసనసభలో కాళేశ్వరంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావుతో కయ్యానికి కాలుదువ్విన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చతికిలపడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చలో భాగంగా సీతారామ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి… ఆ ప్రాజెక్టును నిర్మించిన సమయంలో కేసీఆర్ పక్కనే ఉన్నారని హరీశ్‌రావు అన్నారు. దీంతో రెచ్చిపోయిన పొంగులేటి.. ఆవేశంగా లేచి… హరీశ్‌రావు చెప్పేదంతా అబద్ధమని, సీతారామ ప్రాజెక్టు సమయంలో తాను బీఆర్ఎస్లో లేనేలేనని తెలిపారు. దీంతో వెంటనే హరీశ్‌రావు స్పందిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని పొంగులేటి ట్వీట్ చేసిన పోస్టర్‌ను, అభినందన వ్యాఖ్యలను సభలో చదివి వినిపించారు. అయితే 2014లో ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన పొంగులేటి.. బీఆర్ఎస్లో చేరారు. అనంతర కాలంలో ఓ సభలో మాట్లాడుతూ పొంగులేటి మాట్లాడిన దృశ్యాలను కూడా బీఆర్ఎస్ వారియర్స్ బయటపెట్టారు. అందులో పొంగులేటి మాట్లాడుతూ అరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఏ పార్టీలకీ రాని ఆలోచనతో.. సీతారామ ప్రాజెక్టు ద్వారా.. సుమారు రూ.13వేల కోట్లు ఖర్చుపెట్టి, 9.75 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకొచ్చే.. ఒక బృహత్తరమైన ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం, పెద్దలు కేసీఆర్ నాయకత్వంలో చేపట్టినట్టు వ్యాఖ్యానించారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. స్పేస్లేకపోయినా క్రియేట్ చేసుకుని మరీ పొంగులేటి తన తెలివిని బయటపెట్టుకున్నారని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
మేడిగడ్డ బరాజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) నివేదికను ఆకాశానికి ఎత్తే క్రమంలో ఉత్తమ్‌కుమార్ బోర్లాపడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్డీఎస్ఏ పారదర్శకతతో పనిచేస్తుందని, ప్రపంచంలో వారి అంత నిపుణులు లేరని అసెంబ్లీలో ఉత్తమ్ అన్నారు. ఇందుకు స్పందించిన హరీశ్‌రావు గతంలో ఉత్తమ్ ఎంపీగా ఉన్నప్పుడు ఎన్డీఎస్ఏ బిల్లుపై మాట్లాడిన మాటలను బయటపెట్టారు. ఎన్డీఎస్ఏ రాజ్యాంగ విరుద్ధమన్నారని ఉత్తమ్ చెప్పిన సంగతిని గుర్తుచేశారు. పార్లమెంట్ ద్వారా ఏర్పాటైన సంస్థకు ఒక్కో రాష్ర్టానికి ఒక్కో నిబంధన ఉంటుందా? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పది సార్లు కూలినా… ఎన్డీఎస్ఏ కన్నెత్తి కూడా చూడలేదని వివరించారు. పోలవరం కూలిన సమయంలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేసిన చంద్రశేఖర్ అయ్యర్.. మేడిగడ్డపై రిపోర్టు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏను పొగడ్తల్లో ముంచెత్తడం ద్వారా.. గతంలో ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలను తవ్వుకున్నట్టయిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.