Vinod Kumar | హైదరాబాద్ : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష లీకేజీపై చర్చ జరుగుతుందని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీ వినోద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్, గుజరాత్ రాష్ట్రాల నుంచి నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో రూ. కోట్లు చేతులు మారాయని అంటున్నారు. మరి దీనిపై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని వినోద్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం నుండి చాల మంది పిల్లలు నీట్ పరీక్ష రాశారు. 2015 నుండి నీట్ పరీక్ష మన విద్యార్థులు రాస్తున్నారు. 15 శాతం మాత్రమే ఆల్ ఇండియా కోటాకు పోతున్నారు. నీట్ పరీక్షలో సీటు వచ్చిన వేరే రాష్ట్రాలకు మన పిల్లలు పోవడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో 25 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మరికొన్ని మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నది.
సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రిని నేను ఒక్కటే కోరుతున్న. నీట్ పరీక్షపై మన పిల్లలకు లాభం జరుగుతుందా..? నష్టం జరుగుతుందా..? ఈ విషయంలో స్పష్టత కోసం ఎక్స్పర్ట్ కమిటీ వెయ్యాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా. మన రాష్ట్రంలో మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారితో ఒక కమిటీ వేసి నీట్ పరీక్షపై కమిటీ వేయాలి. రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారు. మనం అదే బాటలో ముందుకు వెళ్లాలని, ఇందుకు గానూ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.