హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల భర్తీకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని, కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వాటినే తాము ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. మార్కెటింగ్ చేసుకోవడంలో రేవంత్‌రెడ్డిని మించినోళ్లు లేరని ఎద్దేవా చేశారు.
తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కనీసం ఖాళీల సంఖ్య కూడా తేల్చలేదని మండిపడ్డారు. మొదట ఖాళీ ఉద్యోగాల సంఖ్య తేల్చాలని డిమాండ్ చేశారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఉపాధ్యాయ నియామకాల కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ వేదికగా వాడుకున్నారని విమర్శించారు.
కేసీఆర్ హాయంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చామని, కానీ, తాము ఇప్పటిలాగా హంగామా చేసి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వలేదని, సరిగా ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పారు. 2023 అక్టోబర్ 16 నాటికి 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫై చేసి, 1,61,572 ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. తాము ఉద్యోగాలు ఇస్తే నియామక పత్రాలు పోస్టులో వెళ్లేవని, ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో ఇస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని మంత్రులు అడుగుతున్నారని, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్కకు ఆ వివరాలు తెలియవా? అని ప్రశ్నించారు. ఆ వివరాలు కూడా తెలియకపోతే వారు మంత్రులుగా ఉండటానికి అనర్హులని ఎద్దేవా చేశారు. ఆర్థిక శాఖ అనుమతితోనే ప్రతి ఉద్యోగం భర్తీ అవుతుందని, 1.62 లక్షల ఉద్యోగాలను కేసీఆర్ భర్తీ చేయలేదని ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి చెప్పగలరా? అని ప్రశ్నించారు.
ఉపాధ్యాయ నియామకాలు కూడా 2023 సెప్టెంబర్ 6న ఇచ్చిన నోటిఫికేషన్‌కు కొనసాగింపేనని, కేవలం ఆరు వేల ఉద్యోగాలను అదనంగా కలిపి తామే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాల భర్తీలో తెలంగాణ బిడ్డలకు 95% రిజర్వేషన్లు ఉండాలనే లక్ష్యంతోనే కేసీఆర్ కొత్త జోనల్ విధానాన్ని తీసుకొచ్చారని, ఈ నేపథ్యంలో ఉద్యోగాల నియామక ప్రక్రియ ఆలస్యమైందని పేర్కొన్నారు. టీచర్ పోస్టులకు సంబంధించిన అనేక కోర్టు కేసులను పరిషరించించింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఉద్యోగాల భర్తీ ఆలస్యం కావడానికి ఇవన్నీ కారణాలేనని, ఇవేవీ తెలియకుండా ఇష్టారీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఖాళీలను గుర్తించండి
వచ్చే డిసెంబర్ 31లోగా రెండు లక్షల ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా మొదట ఉద్యోగ ఖాళీలను గుర్తించాల్సి ఉంటుందని, కానీ ఇప్పటివరకు ఆ పనే జరగలేదని దుయ్యబట్టారు. కోదండరాం సచివాలయానికి వెళ్లి, ఖాళీలు గుర్తించి సీఎం రేవంత్‌రెడ్డికి జాబితా ఇవ్వొచ్చు కదా? అని సూచించారు. ఇదే ఎల్బీ స్టేడియంలో 20 వేల మంది నిరుద్యోగులతో సభ పెట్టి ఎన్ని ఖాళీలు ఉన్నాయో రేవంత్‌రెడ్డి చెప్పాలని సవాల్ చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చాక ప్రచారం చేసుకోవాలని సూచించారు. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందని గతంలో రేవంత్ అన్నారని, ఇప్పుడేమో కొరివి దయ్యం అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పదవుల కోసం పాకులాడలేదు
తాను తెలంగాణ ఉద్యమంలో ఆరంభం నుంచీ ఉన్నానని, తన చరిత్ర అందరికీ తెలుసునని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తాను పదవుల కోసం ఏనా డూ పాకులాడలేదని స్పష్టంచేశారు. తాను ప్రొఫెషనల్ న్యాయవాదినని, తెలంగాణ సాధనలో భాగంగా మలివిడత ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వామినయ్యానని చెప్పారు. నాడు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ పెట్టిన రేవంత్‌రెడ్డా నా గురించి మాట్లాడేది? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం ఎంపీ పదవికి రాజీనామా చేసి గెలిచానని, తెలంగాణ కోసం 32 పార్టీలను ఒప్పించేందుకు కేసీఆర్‌తో కలిసి ప్రయత్నించానని వివరించారు. ప్లానింగ్ బోర్డు చైర్మన్‌గా తెలంగాణ అభివృద్ధి కోసం నిర్వర్తించానని తెలిపారు. రేవంత్‌రెడ్డి కూడా ఎన్నికల్లో ఓడిపోయారనే విషయాన్ని గుర్తించాలని చురకలేశారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కిశోర్‌గౌడ్, బొమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు.