Srinivas Goud | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా, 15 శాతానికి పరిమితం చేయడం సరికాదన్నారు. తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
రాహుల్, ప్రియాంక, ఖర్గేలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు తీసుకొచ్చి ఎన్నికల్లో అడ్డమైన హామీలు ఇచ్చింది. బీసీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో హామీలిచ్చారు. జీవోల ద్వారా అయ్యే పనులు కూడా రేవంత్ ప్రభుత్వం చేయడం లేదు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్క లేదు. బీసీల్లో ఏ కులానికి ఇచ్చిన హామీలు కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. 21 నెలల కాంగ్రెస్ పాలనలో గీత కార్మికులు చాలా మంది ప్రమాదశావత్తు మరణించారు. పన్నెండు కోట్ల రూపాయల మేర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించాల్సి ఉన్నా చెల్లించడం లేదు అని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
కేసీఆర్ కట్టించిన భవనాలను ప్రారంభించే తీరిక కూడా ఈ ప్రభుత్వానికి లేదు. గౌడ కులస్తులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు 25 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నారు. 15 శాతానికి పరిమితం చేశారు. కేసీఆర్ పాలనలో 15 శాతం రిజర్వేషన్లు అమలు చేశాం. 30 శాతానికి పెంచే ఆలోచన ఉన్న క్రమంలో ఎన్నికలు వచ్చి అమలు చేయలేక పోయాం. కొత్త మద్యం షాపులకు గోప్యంగా నోటిఫికేషన్ ఇచ్చారు. 14వ తేదీ నాడు జీవో విడుదల చేస్తే 20న బయటకు వచ్చింది. సర్వాయి పాపన్న జయంతికి ముందే జీవో వచ్చినా జయంతి రోజు ఎందుకు జీవో గురించి చెప్పలేదు. మోసపూరితంగా జీవోను ప్రభుత్వం విడుదల చేసింది అని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
మద్యం షాపుల దరఖాస్తు ఫీజును రూ. 2 లక్షల రూ. 3 లక్షలకు పెంచారు. గౌడ కులస్తులకు మద్యం షాపుల్లో ఇస్తామన్న 25 శాతం రిజర్వేషన్లు జీవోలో ఎందుకు ప్రస్తావించలేదు. తక్షణమే జీవోను రద్దు చేయాలి. గౌడ కులస్థులు ఆర్థికంగా ఎదగకూడదనే కుట్రను కాంగ్రెస్ అమలు చేస్తోంది. రాష్ట్రం పరిధిలో ఉన్న నిర్ణయాలు తీసుకోకపోవడం బీసీలకు మోసం కాదా? జీవో రద్దు చేయకపోతే మద్యం షాపుల కేటాయింపు లాటరీ ప్రక్రియను అడ్డుకుంటాం. ఎవరు ఆపుతారో చూస్తాం. ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు కల్లు దుకాణాలు తరలించే కుట్ర మా నిరసనలతో ఆగిపోయింది అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
సొసైటీలకు మద్యం షాపులు కేటాయించాలి. కల్తీ కల్లు పేరిట కల్లు దుకాణాలపై దాడులు ఆపాలి. పైసలు లేని పదవులు బీసీలకు ఇస్తున్నారు. మద్యం షాపుల జీవోలపై గౌడ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. వచ్చే శనివారం గౌడ సంఘాలతో సమావేశమై కార్యాచరణ ఖరారు చేస్తాం. కల్తీ నాయకుల మామూళ్లతోనే అసలు సమస్య ఉంది. గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో రిజర్వేషన్లు 25 శాతం పెంచేదాకా ఉద్యమిస్తాం అని శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు.