హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మండిపడ్డారు. మంథని పట్టణంలోని రాజగృహాలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ బాకీ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ బాకీ పడ్డ హామీలను “కాంగ్రెస్ బాకీ కార్డు”తో ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిద్దామన్నారు. ఎన్నికలకు ముందు అలవికాని ఆరు గ్యారంటీలు, 420 హామీలను ఇచ్చి, అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని 22 నెలలు గడుస్తున్నా ఒక్క పథకమూ సక్రమంగా నెరవేర్చకుండా.. వాటి ఊసే ఎత్తకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని ధ్వజమెత్తారు.
అడ్డగోలు హామీలతో, అబద్ధాల పునాదులపై అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, కాంగ్రెస్ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉందో చెప్పడానికి ఈ “కాంగ్రెస్ బాకీ కార్డు” బ్రహ్మాస్త్రంలా పని చేస్తుంది. ఈ కాంగ్రెస్ బాకీ కార్డును గడపగడపకు తీసుకెళ్లి చైతన్యవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు పిలుపునిచ్చారు.