Peddi Sudarshan Reddy | పెద్ద వంగర, ఫిబ్రవరి 12: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో సమన్వయం కొరవడి, ప్రజలకు పథకాల అమలులో అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఊరబిసికలాండోడని, పంట పచ్చగున్న చోటే ఆయన ఉంటాడన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సాయి గార్డెన్స్‌లో జరిగిన బీఆర్ఎస్ నాయకుల సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఎట్లా గెలిచారో వాళ్లకే అర్థం కాక తర్జన భర్జన పడుతున్నారన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని వారు ఒకవైపు.. సభ్యత్వం ఉన్నా, మొదటి నుంచి పని చేస్తున్న వారు ఒకవైపు ఉన్నారని, దీంతో సమన్వయం కొరవడిందని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుడు కడియం శ్రీహరి ఊరబిసికలాంటోడని పంట ఎక్కడ పచ్చగుంటే అక్కడే ఉండే రకమని విమర్శించారు. రేవంత్ రెడ్డి పరిస్థితి చూస్తుంటే పూటకో మాట, లంచ్‌కు ముందు ఓ మాట, లంచ్ తర్వాత మరో మాట మాట్లాడతారన్నారు. మంత్రుల మాటలు సైతం పొంతన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు.
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులతో ఇబ్బందులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేశారని పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలను గాలికి వదిలేసి పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నదన్నారు. సంక్షేమ పథకాలను గాలికి వదిలి ఢిల్లీ పర్యటనలు, విదేశాల పర్యటనలు తప్ప రాష్ట్రానికి చేసింది ఏమీ లేదన్నారు. రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే లక్ష్యంగా రైతుకు ఎలాంటి కష్టాలు లేకుండా తాగు సాగు నీటి కష్టాలు లేకుండా చేశారన్నారు. ప్రతి ఆరు నెలలకు పంట పెట్టుబడి సహాయం అందించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటికీ ఏ ఒక్క రైతుకు పూర్తిస్థాయిలో రైతు బంధు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. పథకాల అమలు కోసం తేదీలు మార్చడమే తప్ప ప్రజలకు హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఐలయ్య, సంజయ్, మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్, మాజీ మండల పార్టీ అధ్యక్షులు యాదగిరిరావు, సోమనరసింహారెడ్డి, మాజీ దేవస్థానం చైర్మన్ రామచంద్ర శర్మ, నాయకులు సుధీర్ కుమార్, రాము, రవి, బిక్షపతి, మండల యూత్ అధ్యక్షుడు హరీష్ యాదవ్, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.