Peddi Sudarshan Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాలకు జిల్లాలకు జిల్లాలు మునుగుతున్నా.. రేవంత్ సర్కార్ మొద్దు నిద్రలో ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ చాలా రోజుల నుంచి హెచ్చరిస్తోంది. అయినా సీఎం, మంత్రులు అధికార యంత్రాoగాన్ని అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారు. జిల్లాలకు జిల్లాలు మునిగే పరిస్థితి ఉంది. రాష్ట్రమంతా వరదలతో అతలాకుతలం అవుతుంటే సీఎం మూసీ మీదనే ప్రేమ ఒలక బోస్తున్నారు. ఆటల పోటీల మీద సీఎం రివ్యూ చేస్తున్నారు. సీఎం కనీసం వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. ప్రభుత్వం, కాంగ్రెస్ మొద్దు నిద్రలో ఉన్నాయి. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వరద బాధితులను ఓదారుస్తున్నారు అని పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
పంటలు అనేక ఎకరాల్లో మునిగిపోయినా ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. యూరియా దొరక్క రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లకుండా యూరియా కోసం లైన్లలో నిలబడే దుస్థితి నెలకొంది. యూరియా కష్టాలు ఇంకా పెరుగుతాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును బట్టి తెలుస్తోంది. యూరియా ఇవ్వని సీఎం రేవంత్, మంత్రి తుమ్మల తమ పదవులకు రాజీనామా చేయాలి అని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పౌర సరఫరాల శాఖలో జరిగిన ధాన్యం సేకరణ కుంభకోణంపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించాలని ప్రయత్నిస్తే విషయం న్యాయస్థానాల్లో ఉందని తప్పించుకుంటున్నారు. వివాదం కోర్టుల్లో ఉంటే ఆర్టీఐ సమాచారం ఇవ్వరా? ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశానికి ధాన్యం సేకరణ టెండర్ల ఫైల్ రాబోతోంది. నలుగురు బిడ్డర్లకు క్విడ్ క్రో పద్ధతిలో లబ్ది చేకూర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రూ. 400 కోట్ల రూపాయల ఈఎండీలో బిడ్డర్ల నుంచి రూ. 68 కోట్లు జప్తు చేయాలనీ ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 400 కోట్లను బిడ్డర్ల నుంచి వసూలు చేయకపోతే మొత్తం కేబినెట్ జరిగిన తప్పుకు భాద్యత వహించాల్సి ఉంటుంది. తప్పు చేసిన బిడ్డర్లను కాపాడితే సీఎం, మంత్రులు జైలుకు వెళ్లక తప్పదు. ధాన్యం సేకరణ కుంభకోణంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. ఎన్ని దర్యాప్తు సంస్థలున్నాయో అన్నిటికి మేము ధాన్యం సేకరణ కుంభకోణంపై ఫిర్యాదు చేశాo. ఎల్లుండి జరిగే కేబినెట్లో బిడ్డర్లకు మేలు చేసే చర్యలకు ఆమోదం తెలిపితే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో దోషిగా నిలబెడుతాము. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి సంబంధించి మరో కుంభకోణాన్ని బయటపెడతాం అని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.