Guvvala Balaraju | హైదరాబాద్ : నిన్న అచ్చంపేట నియోజకవర్గం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చెంచుల గొంతు నొక్కారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫైర్ అయ్యారు.
ఇవాళ తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడారు. ఇందిర సౌర గిరి జల వికాసం పథకం నా నియోజకవర్గం నుంచి రేవంత్ ప్రారంభించారు. నిన్న నిర్వహించిన సభ కాంగ్రెస్ శ్రేణుల సభగా మారింది. దళిత, గిరిజన, ఆదివాసీలకు ఆ సభలో సముచిత స్థానం ఇవ్వలేదు. చెంచుల గొంతు నొక్కారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి చెంచులకు అవకాశం ఇవ్వలేదు అని బాలరాజు పేర్కొన్నారు.
కేసీఆర్ హయాంలో ఆరు లక్షల మందికి ROFR పట్టాలు ఇవ్వడం జరిగింది. చెంచు పెంటలను కూడా గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే. బౌరాపూర్ చెంచు లక్ష్మి దేవాలయాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌దే. 26 మందికి కేసీఆర్ హయంలోనే పట్టాల పంపిణీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్‌తో ఆగిపోయిన పట్టాల పంపిణీని నిన్న రేవంత్ రెడ్డి పూర్తి చేశారు. కొత్తగా చేసిందేమీ లేదు అని మాజీ ఎమ్మెల్యే గువ్వల పేర్కొన్నారు.
చెంచులుండే ప్రాంతంలో రేవంత్ సభ నిర్వహించలేదు. చెంచులు లక్ష్మి నరసింహ దేవాలయాన్ని ప్రారంభించాలనుకుంటే వారిని పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ రెడ్డి తనకు తాను ఒక రాజు అనుకుంటున్నారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పేరును మార్చాలని సీఎం మంత్రులను సభ వేదిక మీద కోరారు. సీఎంకు మంత్రులకు సమన్వయం లేదని రేవంత్ రెడ్డి మాటలే రుజువు చేశాయి. రేవంత్ నల్లమలలో పుట్టకున్నా పుట్టినట్టు చెప్పుకుంటున్నారు. సీఎం ఎక్కడికి వెళ్లినా నక్కజిత్తుల మాటలు చెబుతుంటారని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డి పల్లిలో మాజీ గ్రామ సర్పంచ్ ఆత్మహత్యకు కారణమయ్యారు. కొండారెడ్డి పల్లిలో కూడా రేవంత్‌కు ప్రజాదరణ లేదు అని గువ్వల బాలరాజు అన్నారు.
ఉమామహేశ్వర, చెన్న కేశవ రిజర్వాయర్లకు కేసీఆర్ హయాంలోనే శంకుస్థాపనలు జరిగాయి. చివరకు అందాల పోటీలకు కేసీఆర్ ఆనవాళ్లే బ్రాండ్ అంబాసిడర్లుగా మారాయి. గిరిజనులు, ఆదివాసీలకు బేడీలు కేసీఆర్ హాయంలో వేశారని రేవంత్ అంటున్నారు. నిన్న సభకు రాకుండా చెంచులను నిర్బంధించింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంలో 17 మంది చనిపోయినా.. అటువైపు వెళ్లని అసమర్ధ, మూర్ఖ సీఎం రేవంత్ రెడ్డినే. సాగు నీళ్లు ఇవ్వకుండా మోటార్లు, సోలార్ విద్యుత్ ఇస్తే రైతులకు ఏం లాభం. డిక్లరేషన్లు అలంకార ప్రాయంగా మారాయి. ఈ ప్రభుత్వం పని అయిపోయిందని ప్రజలు ఇప్పటికే డిక్లేర్ చేశారు. ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినా ఇక లాభం లేదు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు తప్పుగా ప్రచారం చేస్తున్నట్టే దళిత, గిరిజన, ఆదివాసీలకు మోసపూరిత డిక్లరేషన్ ను సీఎం ప్రకటించారు. నల్లమలలో యురేనియం వెలికితీతను అడ్డుకున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రా కంపెనీకి నల్లమలలో ఖనిజ సంపదను తాకట్టు పెడితే బీఆర్ఎస్ అడ్డుకుంది. ఇపుడు రేవంత్ కన్ను మళ్ళీ ఆ సంపదపై పడ్డట్టుంది. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ దిగివచ్చినా.. నల్లమల సంపదను తరలించుకు పోనివ్వం అని గువ్వల బాలరాజు స్పష్టం చేశారు.