హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతోనే అక్రమ దందా సాగుతున్నదని, అధికార యంత్రాంగం చోద్యం చూస్తున్నదని విమర్శించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? లేదా? అని ప్రశ్నించారు. శనివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక దందాకు అడ్డుకట్ట వేయకుంటే గోదావరి పరివాహక ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ కండ్లు తెరిచి ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
ఓటమి భయంతోనే..
సీఎం రేవంత్‌రెడ్డి ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలేదని గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. రెండేండ్లుగా పాలకవర్గాలు లేకపోవడం, నిధులు రాకపోవడంతో పల్లెల్లో చీకట్లు అలుముకున్నాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణ చేతగాని ప్రభుత్వం కనీసం బతుకమ్మ, దసరా పండుగల సందర్భాల్లోనైనా సౌకర్యాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. పెద్ద పంచాయతీలకు రూ.5 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.3 లక్షల చొప్పున నిధులు మంజూరుచేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పండుగలు సమీపిస్తున్నా సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ఎందుకివ్వడంలేదని ప్రశ్నించారు.
ఫిరాయింపులపై సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం
ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి చిత్రవిచిత్రంగా ప్రవరిస్తున్నారని గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కండువా కప్పినంత మాత్రాన పార్టీలో చేరినట్టా? అని సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని పేర్కొన్నారు ‘వారికి కప్పిన కండువాలు కాకుంటే మరేం ప్రామాణికం? ఫిరాయింపు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయలేదా? కడియం శ్రీహరితో కలిసి సీఎం ఎన్నికల ప్రచారం చేయలేదా? అభివృద్ధి కోసమే కడియం కాంగ్రెస్‌లోకి వచ్చినట్టు చెప్పలేదా?’ అని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఢిల్లీలో చిల్లరగా మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయం కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బుద్ధిచెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.ట్రంప్ బాటలో సీఎం రేవంత్‌రెడ్డి: గెల్లు శ్రీనివాస్‌యాదవ్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరహాలోనే సీఎం రేవంత్‌రెడ్డి కూడా అసంబద్ధ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ విమర్శించారు. సుభిక్షమైన పాలనా విధానాలతో తెలంగాణ ప్రజల బతుకుల్లో వెలుగులు నింపిన కేసీఆర్‌ను ట్రంప్‌తో పోల్చడం సిగ్గుచేటని పేర్కొన్నారు. వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1పై కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌కు వెళ్లడం దుర్మార్గమని మండిపడ్డారు. వెంటనే కోర్టు సూచనల మేరకు పరీక్షలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఫిరాయింపులను ప్రోత్సహించిన సీఎం ఇప్పుడు తప్పించుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని, గు డిలో కప్పే కండువాలకు, కాంగ్రెస్ కండువాలకు తేడా తెలియకపోవడం సిగ్గుచేటని దు య్యబట్టారు. ఇప్పటికైనా డ్రామాలు ఆపి దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఫైనాన్స్ కమిషన్ మాజీ డైరెక్టర్ గోసుల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు పడాల సతీశ్, నర్సింగ్ పాల్గొన్నారు.