Dasyam Vinaybhasker | హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 20 : వృత్తి కులాలు ముఖ్యంగా బీసీ కులాలు సంఘటితం కావలసిన సందర్భం ఏర్పడిందని, అందరూ సంఘటితమైతేనే సమస్యలు పరిష్కారమవుతాయని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా స్వర్ణకారుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారం హనుమకొండ రస్తాలోని వీనస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. నేటి గ్లోబలైజేషన్లో కులవృత్తులు, చేతివృత్తులు కనుమరుగవుతున్నాయని, మల్టీ నేషనల్, మల్టీ బ్రాండింగ్ కంపెనీల కారణంగా చిన్న కుటీర పరిశ్రమల అస్తిత్వం దెబ్బతింటోందన్నారు. 2009 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం చిరువ్యాపారులు, కులవృత్తిదారులు, స్థానిక వ్యాపారస్తులకు అన్నివిధాల సహకరించానని వివరించారు. స్వర్ణకారుల వృత్తి ఎంతో నైపుణ్యాలతో, శ్రమతో సమ్మిళితమైన కళావృత్తి అని ఆయన కొనియాడారు. మల్టీ నేషనల్ కంపెనీల కారణంగా స్వర్ణకారుల జీవనం, వ్యాపారం గడవడం ఇబ్బందవుతుందని, ఈ ప్రతికూల పరిస్థితుల్లో స్వర్ణకారులు అందరూ సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వెండి, బంగారు ఆభరణాల తయారీలో ఆయా వృత్తి కులాల వారే ఉండాలని, ఆ వైపుగా సంఘం కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని శాలువాలతో ఘనంగా సన్మానించారు. సంఘం అధ్యక్షుడిగా పానుగంటి శ్రీధర్, ప్రధాన కార్యదర్శిగా మణింద్రనాధ్, కోశాధికారిగా సతీష్, ఉపాధ్యక్షులుగా బ్రహ్మం, రవి, రాజ్ కుమార్, ప్రసాద్, పూర్ణచందర్, గౌరవ సలహాదారులుగా కోటేశ్వర్ రావు, కమలాకర్, రవీంద్ర, చక్రపాణి, ముఖ్య సలహాదారుగా మధు సుధానాచారి, సహాయ కార్యదర్శులుగా రత్నాకర్, ప్రవీణ్, కార్యవర్గ సభ్యులుగా వాసు, వేణు, అనిల్, ప్రణయ్, రాజు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, అరవింద్, కిరణ్, శ్రీనివాస్, గాయత్రి ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాఘవా చారి, వెంకట స్వామి, సత్యనారాయణ, పెంటయ్యచారి, ఈశ్వరప్రసాద్, కమలాకర్, కోటేశ్వర్ రావు, రాజేందర్, కృష్ణమాచారి, రమేష్, శ్రీనివాస్ చారి, జయ సేన, చక్రపాణి, భిక్షపతి, రవీంద్ర, జగన్, జయసాగర్ పాల్గొన్నారు.