BRS Ex MLA Balka Suman | కాంగ్రెస్లో ఎస్సీ, ఎస్టీలపై తీవ్ర వివక్ష నెలకొందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్ ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి న్యాయం చేయాలని అడిగినందుకు దళితుడైన బక్క జడ్సన్పై కాంగ్రెస్ పార్టీ బహిష్కరణ వేటు వేసిందని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయాలని బక్క జడ్సన్ కోరినందుకు క్రమశిక్షణ ఉల్లంఘించారని పార్టీ సీరియస్ అయిందన్నారు. దీనికి కారణం బక్క జడ్సన్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాడు కావడమేనన్నారు.
నాడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి ప్రచారం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పైసలిచ్చి, పీసీసీ చీఫ్ అయ్యాడంటూ అవహేళన చేశారన్నారు. ఓటుకు నోటు దొంగకు పీసీసీ చీఫ్ ఎలా ఇస్తారంటూ నిలదీశారని అన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే తాము పార్టీలో ఉండబోమని కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి హెచ్చరికలు జారీ చేసినా వీరిపై క్రమశిక్షణ చర్యలు లేవని బాల్క సుమన్ గుర్తు చేశారు. దీనికి వారంతా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే కారణం అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సామాజిక వర్గం వారు ఏది చేసినా నడిచిపోతుందని బాల్క సుమన్ అన్నారు. కానీ ఎస్సీలు ఒక్క మాట అన్న ఓర్వలేరని ధ్వజమెత్తారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ పాటించే సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీలకు దక్కే గౌరవం అని నిలదీశారు.