రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. రెండు దశాబ్దాలుగా కంచుకోటగా ఉన్న సిరిసిల్ల నియోజకవర్గంలో మరోసారి గులాబీ విజయఢంకా మోగించింది. మొత్తంగా నియోజకవర్గంలోని ఐదు మండలాలు తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 117 స్థానాల్లో 60 స్థానాలు కైవసం చేసుకున్నది. అధికార దుర్వినియోగం, బల ప్రయోగం లాంటి పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ పన్నిన కుట్రలను ఓటర్లు తిప్పికొడుతూ తీర్పు నివ్వడంతో కాంగ్రెస్ పార్టీ కకావికలమై కేవలం 23 స్థానాలతో సరిపెట్టుకున్నది. కేంద్రమంత్రి బండి సంజయ్ ఊకదంపుడు ఉపన్యాసాలను ప్రజలు నమ్మలేదు. కేవలం 13 స్థానాల్లోనే బీజేపీ తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోగలిగింది. క్షేత్రస్థాయిలో ప్రజలు బీజేపీని పూర్తిగా తిరసరించారు. ఆ పార్టీకి సిరిసిల్లలో ఉనికి లేదని ఫలితాలు తేల్చి చెప్పాయి. బీజేపీ కంటే స్వతంత్రులే 21 స్థానాల్లో గెలిచారు.
అధికార కాంగ్రెస్ సిరిసిల్లలో చతికిలపడింది. దాదాపు 50కి పైగా గ్రామాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి(కేకే) సొంత మండలంలోనే ఆ పార్టీకి ప్రజలు చుకలు చూపించారు. ఆయన సొంత ఇలాకా ముస్తాబాద్ మండలంలో కాంగ్రెస్ గెలిచింది కేవలం మూడు పంచాయతీలు మాత్రమే. అధికార పార్టీని ప్రజలు చీదరించుకున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పరిశీలకులు చెబుతున్నారు. రెండో విడతలో తంగళ్లపల్లి మండలంలో 30 సర్పంచ్ స్థానాలకు 16 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మూడో విడత ఎన్నికలు జరిగిన ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలపై ప్రభావం చూపింది. 87స్థానాల్లో 44 స్థానాలు దక్కించుకున్నది. కాగా, ఫలితాలతో బీఆర్ఎస్పై ఉన్న నమ్మకం, పల్లెల్లో ప్రగతి పరుగులు పెట్టించిన రామన్నపై అభిమానం జనంలో చెక్కు చెదరలేదు.
హైదరాబాద్, డిసెంబర్17 (నమస్తే తెలంగాణ): సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించిందని, సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. రెండు దశాబ్దాలుగా సిరిసిల్ల ప్రజలకు పార్టీతో ఉన్న అనుబంధం ఎంత బలమైనదో ఈ ఫలితాలు మరోసారి తేల్చిచెప్పాయని, ఉద్యమ పార్టీగా ఉన్నా, అధికార పార్టీగా ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సిరిసిల్ల ప్రజలు గులాబీ జెండానే గుండెల్లో పెట్టుకున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కష్టపడిన ప్రతి కార్యకర్తకు, విజయం సాధించిన ప్రతి అభ్యర్థికీ కృతజ్ఞతలు తెలిపారు. అధికార పార్టీ ప్రలోభాలకు లొంగకుండా, బీజేపీ అసత్య ప్రచారాలను తిప్పికొట్టి, కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి, బీఆర్ఎస్పై నమ్మకం ఉంచి 60స్థానాల్లో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేశారు. అధికార కాంగ్రెస్ కేవలం 23 స్థానాల్లో చాలా కష్టం మీద గెలిచిందని, బీజేపీ కేవలం 13 పంచాయతీలకే పరిమితమైందని విమర్శించారు.