మంచిర్యాల, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంత్రి వివేక్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఎన్నికల కోడఖ ప్రకారం సోమవారం సాయంత్రం ప్రచారానికి గడువు ముగిసినా.. మంగళవారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16, 13, 11 వార్డుల్లో మంత్రి వివేక్ స్వయంగా ప్రచారం చేశారంటూ ప్రచార ఫొటోలను మీడియాకు చూపించారు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాసంలో మీడియాతో సుమన్ మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున కార్లలో తెచ్చి పంపిణీ చేశారని ఆరోపించారు. ఒక్కో ఓటుకు రూ.5,000 చొప్పున పంచడం మొదలుపెట్టారని తెలిపారు.
కులసంఘాల మీటింగ్‌లు పెట్టుకొని, సంఘ భవనాలకు ప్రొసీడింగ్స్ ఇస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో అధికార వ్యవస్థ కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. చెన్నూర్, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీల్లో ఓడిపోతాననే భయంతోనే ఇవన్నీ చేస్తున్నారని తెలిపారు. తమ అభ్యర్థుల మీద దాడులు జరిగినా.. ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు జరిగినా.. ఓటర్లపై నిర్బంధాలు, నియంతృత్వానికి పాల్పడినా.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కలెక్టర్ స్పందించి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.