ఖమ్మం రూరల్/ఆర్మూర్‌టౌన్, ఫిబ్రవరి 13 : ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారుల తీరుపై బీఆర్ఎస్, సీపీఎం శ్రేణులు నిరసన వ్యక్తంచేశాయి. శుక్రవారం స్థానిక మేధా ఇంజినీరింగ్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ చేపట్టారు. 3వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి చేతితో కాంగ్రెస్ అభ్యర్థి 17ఓట్ల తేడాతో ఓటమి చెందడంతో కాంగ్రెస్ అభ్యర్థి విజ్ఞప్తి మేరకు రీకౌంటింగ్ చేపట్టగా మళ్లీ అదే ఫలితం వచ్చింది. 1వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి దుంపల నాగరాజు కాంగ్రెస్ అభ్యర్థి వరకుమార్ చేతిలో ఓటమి చెందాడు.
దీంతో రీకౌంటింగ్ చేపట్టాలని నాగరాజు కోరడంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. బీఆర్ఎస్, సీపీఎం నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్ కేంద్రం గేట్ వద్దకు చేరుకొని అధికారుల తీరును నిరసిస్తూ ధర్నాకు దిగారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డులో రెండే ఓట్ల తేడాతో ఫలితం తారుమారైంది. రీకౌంటింగ్ చేయాలని బీఆర్ఎస్ అభ్యర్థి పట్టుబట్టగా అధికారులు స్పందించలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకుని ధర్నాకు దిగారు. చివరకు రీకౌంటింగ్ చేపట్టగా, మళ్లీ అదే ఫలితం వచ్చింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 24వ వార్డులో రెండు ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తూరి వరలక్ష్మి ఓటమి పాలైంది.
కాంగ్రెస్ అభ్యర్థి దామెర విజయలలితకు 401, వరలక్ష్మికి 399 ఓట్లు వచ్చాయి. ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అంతకుముందే అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను లోనికి అనుమతించలేదు. దీంతో మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. అనుమతి లే కుండా ఎలా పంపిస్తున్నారని ప్రశ్నించారు. సహనం కోల్పోయిన వినోద్ బీఆర్ఎస్ శ్రేణులపై విరుచుకుపడి బయటికి వెళ్లిపోయారు.