రేగొండ, మార్చి 2 : డీబీఎం 38 కాల్వల ద్వారా సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని పరకాల-భూపాలపల్లి జాతీయ రహదారిపై ఆదివారం ధర్నా నిర్వహించారు. దీంతో రెండు గంటలపాటు రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షుడు ఇంగె మహేందర్ మాట్లాడుతూ.. ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ఇప్పటివరకు డీబీఎం 38 ద్వారా చుక్క నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దిక్కులేక రైతులు పొలాల్లో పశువులను మేపుతున్నారని పేర్కొన్నారు.
అప్పులు పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన చెందారు. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, రైతు భరోసా కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదని దుయ్యబట్టారు. స్థానిక ఎమ్మెల్యే స్వలాభం కోసం పనిచేస్తున్నాడు తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదని ఆరోపించారు. ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించక పోతే బీఆర్ఎస్ పక్షాన పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు అంకం రాజేందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామాల పాపిరెడ్డి, నాయకులు కోలెపాక భిక్షపతి, బండి రమేశ్, గంపల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.