హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ జల హకులకు తీవ్ర ప్రమాదం వాటిల్లిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ లోపాలపై గత ఏప్రిల్ 7న లేఖ రూపంలో బీఆర్ఎస్ చేసిన హెచ్చరికలను ప్రభుత్వం బేఖాతరు చేయడం వల్లే నేడు పంపులు దెబ్బతిని, కాళేశ్వరం, దేవాదుల వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల నిర్వహణ దారుణంగా విఫలమైందని మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయిందని, ఏపీ 74 శాతం నీటిని వినియోగించుకుంటుంటే, తెలంగాణ కేవలం 25 శాతానికే పరిమితం కావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ తీసుకుంటున్న సోలార్ ఆధారిత విద్యుత్తు విధానాలు సాగునీటి రంగానికి తీవ్ర ముప్పుగా మారబోతున్నాయని హెచ్చరిస్తూ.. వివాదాస్పద రైతు డిసమ్ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంతోపాటు, కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణకు తగిన నిధులు తక్షణమే కేటాయించి, తెలంగాణ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా రాష్ట్ర జల హకులను కాపాడాలని డిమాండ్ చేశారు.
లిఫ్టులకు నష్టం వాటిల్లితే సర్కార్‌దే బాధ్యత
రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కాళేశ్వరం గాయత్రి పంపింగ్ స్టేషన్, దేవాదుల తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటర్లు దెబ్బతిన్నాయి. భారీ మోటర్లను పదేపదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని ముందుగానే మేం హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. వేల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కీలక సాగునీటి మౌలిక వసతులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నష్టపోతుండటం శోచనీయం’ అని వాపోయారు. సోలార్ విద్యుత్తు అందుబాటులో ఉండే పగటి వేళల్లోనే లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు నడుపాలని ట్రాన్స్ కో సూచించడం వల్ల, భారీ పంపులను తరచూ స్టార్ట్, స్టాప్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని తెలిపారు. ఈ విధానాల వల్ల పంపులు, మోటర్లకు నష్టం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్ణయాలకు ముందు సాంకేతిక అధ్యయనం జరిగిందా? లేదా? అని ప్రశ్నించారు.
జీవో 8తో అనేక ప్రమాదాలు
జీవో 8 వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయని హరీశ్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘టీజీఆర్ పీడీసీఎల్‌కు అధిక పునరుత్పాదక (సోలార్) విద్యుత్తు కేటాయించాల్సి వస్తుంది. సోలార్ విద్యుత్తు ప్రధానంగా ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అందుబాటులో ఉంటుంది. దీంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పంపింగ్ కార్యకలాపాలు పరిమిత సమయానికి కట్టుబడే ప్రమాదం ఉన్నది. నీటి ఎత్తిపోతలు తగ్గి, కృష్ణా-గోదావరి జలాల వినియోగ సామర్థ్యం దెబ్బతింటయ్. కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు ఇతర ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవడం. విద్యుత్తు లభ్యత ఆధారంగా పంపింగ్‌ను పరిమితం చేయడం రాష్ట్ర జల హకులకు విరుద్ధం. నీటి వినియోగం తగ్గితే వ్యవసాయం, తాగునీరు, భూగర్భ జలాలు, చేపల పెంపకం, పరిశ్రమలు, విద్యుత్తు ఉత్పత్తి, గ్రామీణ జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది’ అని వివరించారు.
తొలిసారిగా కనిష్ఠ నీటి వినియోగం
కాంగ్రెస్ పాలనలో కృష్ణా జలాల వినియోగం కనిష్ఠ స్థాయికి చేరిందని హరీశ్ విమర్శించారు. ‘తెలంగాణకు కేటాయించిన తాతాలిక నీటి వాటా 34శాతం కాగా, ఏపీకి 66 శాతంగా ఉన్నది. 2024-25లో ఆంధ్రప్రదేశ్ 72.73 శాతం నీటిని వినియోగించగా, తెలంగాణ 27.27 శాతం మాత్రమే వాడుకున్నది. 2025-26లో ఏపీ వినియోగం 74.90 శాతానికి పెరుగగా, తెలంగాణ వినియోగం చారిత్రక కనిష్ఠమైన 25.10 శాతానికి పడిపోయింది. తెలంగాణ జల హకులు, రైతుల ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి ఇది మరో నిదర్శనం’ అని మండిపడ్డారు. ‘లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు పంపింగ్ సీజన్లో 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా కల్పించాలి. తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి జలాల పూర్తి వినియోగం కోసం తక్షణ చర్యలు చేపట్టాలి. రైతు డిసమ్ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలి. కాళేశ్వరం, దేవాదుల తదితర ప్రాజెక్టుల నిర్వహణ, ఆధునికీకరణకు తగిన బడ్జెట్ కేటాయించాలి. వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలు, విద్యుత్తు ఉత్పత్తి తదితర రంగాలకు తగిన నీటి లభ్యతను నిర్ధారించాలి’ అని డిమాండ్ చేశారు.
పాలమూరును అడ్డుకున్నది కాంగ్రెస్సే
సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో కృష్ణా నీటి వినియోగంపై కనీస అవగాహన లేకపోవడం పాలమూరుకే కాదు, యావత్ తెలంగాణకు దురదృష్టకరమని హరీశ్ విమర్శించారు. ఇలాంటి అవగాహన లేని వ్యక్తి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ జల హకులకు తీవ్ర విఘాతమని ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబ్‌నగర్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా హరీశ్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. ఈ ఏడాది మే 2న తెలంగాణ ఈఎన్సీ కృష్ణా బోర్డుకు రాసిన అధికారిక లేఖను హరీశ్ తన పోస్టుకు జతపరిచారు. ఏపీ 74 శాతం కృష్ణా నీటిని వాడితే, తెలంగాణ 25 శాతానికే పరిమితమైందని తెలిపారు. ‘మీ లాగా ఆధారం లేకుండా, అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడే అలవాటు నాకు లేదు రేవంత్‌రెడ్డీ! మీ ప్రభుత్వం రాసిన అధికారిక లేఖల్లో ఏమున్నదో కూడా మీకు, నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తెలియదా? అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా ఇంకెప్పుడు ఇరిగేషన్ మీద ప్రిపేర్ అవుతరు?’ అని చురకలంటించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి, రెండున్నరేండ్లలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చేసింది గుండుసున్నా అని ఎద్దేవాచేశారు.
12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1,226 గ్రామాలకు తాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా పాలమూరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తున్నదని మండిపడ్డారు. నాడు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసులు వేయించి, పనుల పురోగతిని అడ్డుకున్నది రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీయేనని, ఆ కేసులను ఎదురొని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్ట్ పనులను పరుగులు పెట్టించిందని గుర్తుచేశారు. నాడు కాంగ్రెస్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, రైతులను రెచ్చగొట్టినా, బీఆర్ఎస్ ప్రభుత్వం 27,191 ఎకరాల భూసేకరణ చేసిందని స్పష్టంచేశారు. మరి ఈ రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఎకరాల భూమి సేకరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. సగం పాలనా కాలం పూర్తయిన తర్వాత ఇప్పుడు కుంభకర్ణ నిద్రలేచి, భూసేకరణకు ప్రతిపాదనలు అనడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఏడాదికి ఆరు లక్షల ఎకరాల చొప్పున, రెండేండ్లలో 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట తప్పిన రేవంత్‌రెడ్డికి ఇరిగేషన్ గురించి మాట్లాడే హకు, అర్హత లేవని తేల్చిచెప్పారు.
పాలమూరు తలరాత మార్చింది కేసీఆరే
గత టీడీపీ, కాంగ్రెస్ పాలనలో వలసలు, ఆకలి చావులకు నిలయంగా మారిన పాలమూరు తలరాతను మార్చింది కేసీఆరేనని హరీశ్ గుర్తుచేశారు. వలసపోయిన వాళ్లను తిరిగి వాపస్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పాలనలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని, 2014 వరకు 27 వేల ఎకరాలు మాత్రమే సాగైన ఆయకట్టును భూసేకరణ ద్వారా ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచామని వివరించారు. పదేండ్ల్ల బీఆర్ఎస్ పాలనలో ఒక పాలమూరులోనే మొత్తంగా 10 లక్షల ఎకరాలకు నీళ్లందించామని గుర్తుచేశారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు అందకపోతే తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్‌తో రైతాంగాన్ని ఆదుకున్న ఘనత బీఆర్ఎస్దేనని తెలిపారు. ‘ఈ 30 నెలల కాలంలో తట్టెడు మట్టి తీయకుండా, ఒక చెక్ డ్యామ్ కట్టకుండా కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ పాలన గురించి మాట్లాడటం మీ చేతగానితనానికి నిదర్శనం. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన మీరు, అవే అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపలేరనే విషయాన్ని గుర్తుంచుకోండి’ అంటూ సీఎం రేవంత్ రెడ్డికి హితవు పలికారు.
రాష్ట్రంలోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. కాళేశ్వరం గాయత్రీ పంపింగ్ స్టేషన్, దేవాదుల తదితర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటర్లు దెబ్బతిన్నయ్. భారీ మోటర్లను పదేపదే ఆన్-ఆఫ్ చేయడం వల్ల పరికరాలు దెబ్బతింటాయని ముందుగానే మేం హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. -హరీశ్
సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలో కృష్ణా నీటి వినియోగంపై కనీస అవగాహన లేకపోవడం పాలమూరుకే కాదు, యావత్ తెలంగాణకు దురదృష్టకరం. ఇలాంటి అవగాహన లేని వ్యక్తి రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ జల హకులకు తీవ్ర విఘాతం. -హరీశ్