ములుగు, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ: దక్షిణ భారత దేశంలో కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. ములుగు జిల్లాకేంద్రంలోని గట్టమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క-సారలమ్మను దర్శించుకొని, పూజలు నిర్వహించారు. అంతకుముందు హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్తో కలిసి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటు అనంతరం పదేండ్లుగా మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధాని మోదీకి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని గుర్తుచేశారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన మేడారం జాతరకు బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే మొదటిసారి జాతరకు రూ.100 కోట్లు కేటాయించామని, ఆ తర్వాత ప్రతీసారి రూ.75 కోట్ల చొప్పున కేటాయిస్తూ వసతులు కల్పించి ఘనంగా జాతర నిర్వహించినట్టు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా బస్సులు నడిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస్, కేసీఆర్ కృషితోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పోరాటంతో గిరిజన యూనివర్సిటీ రాష్ట్రానికి రావడం సంతోషకరమని, అందుకోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.17 క్లో ఇచ్చి యూనివర్సిటీకి కావలసిన భూములను సమకూర్చిందని, రూ.850 కోట్లతో ఇప్పుడు యూనివర్సిటీ నిర్మాణాన్ని చేపట్టడం గర్వకారణం అన్నారు.
పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు మనోధైర్యం కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. మళ్లీ మంచి రోజులు వస్తాయని, అప్పటివరకు ధైర్యంతో పార్టీ సిద్ధాంతాల మేరకు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని స్పష్టంచేశారు. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు, పింఛన్లు రావడం లేదని లబ్ధిదారులు బాధ పడుతున్నారని అన్నారు. సింగరేణి ఎన్నికల్లో పార్టీ నిర్ణయం మేరకు పోటీ చేయలేదని చెప్పారు. కాంగ్రెస్కు, బీఆర్ఎస్కు కేవలం 1.7 శాతం ఓట్లు తేడా వచ్చాయని, వంద రోజుల తర్వాత తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, శంకర్ నాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.