ప్రభుత్వమంటే ఇండ్లు కట్టిస్తది కదా!
అక్కా.. అమ్మ ఎందుకు ఏడుస్తుంది? మన ఇండ్లు ప్రభుత్వం ఎందుకు కూలగొట్టింది? ఎక్కడైనా ప్రభుత్వం పేదోళ్లకు ఇండ్లు కట్టిస్తుంది కదా? మరి ఇక్కడ ఎందుకు కూలగొట్టింది? మనం పేదోళ్లం కాదా? లేదా ఇప్పుడున్న సర్కార్‌కు దయలేదా? మన చుట్టుపక్కల పెద్దపెద్ద భవంతులు ఉన్నాయి కదా? మరి వాటినెందుకు కూల్చలేదు. గట్టిగా గాలొస్తే కూలే మన రేకుల షెడ్డులపైనే అంతపెద్ద బుల్డోజర్లతో దాడి చేయడమేమిటి? మనం ప్రభుత్వానికి శుత్రువులమా?
– అభినవ్ తన అక్కతో పంచుకున్న సందేహం ఇది
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఆకలితో చూస్తున్న బిడ్డలకు ఎలా వండిపెట్టాలో తెలియక నలిగిపోతున్న ఓ తల్లి.. నాన్న నా పుస్తకాలు ఏవి? నేను హోంవర్క్ చేసుకోవాలి? లేకపోతే మా సారు కొడుతాడు? అని అడుగుతున్న ఓ కొడుక్కి ఏం చెప్పాలో తెలియక కుమిలిపోతున్న ఓ తండ్రి.. శత్రుదేశంపై దాడిచేసి సర్వనాశనం చేసినట్టుగా చెదిరిపోయిన గూడును చూసి వేదనపడుతున్న ఓ వృద్ధుడు.. ఇలా ఎవ్వరిని కదిలించినా సమాధానం కన్నీళ్లతోనే వస్తున్నది.
మొత్తంగా సున్నం చెరువు భీకర పరిస్థితులు బాధితులను ఇంకా వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ బుల్డోజర్లు చేసిన గాయం వారికి సలుపుతూనే ఉన్నది. మాదాపూర్ సున్నం చెరువులోని ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను ఈ నెల 8న హైడ్రా భారీ యంత్రాలతో కూల్చివేసింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లో సామగ్రి బయటకు తీసుకునే సమయమైనా ఇవ్వకుండా వర్షంలో అందరినీ కట్టుబట్టలతో బయటకు పంపి కూల్చివేతలు చేపట్టింది.
పండగపూట వర్షంలో పిల్లలను తీసుకొని ఎటుపోవాలో దిక్కుతోచక బాధితులు బిక్కుబిక్కుమంటూ కన్నీరుమున్నీరయ్యారు. మహిళ సహ ఇద్దరు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే యత్నం చేశారు. 10-15 ఏండ్ల నుంచి రేకు షెడ్డు వేసుకొని ఉంటున్న నిరుపేదల గూడును సైతం నేలమట్టం చేశారు. రీసర్వే చేయాలని కోర్టు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు.
15 ఏండ్లుగా నివాసం
గొప్ప గొప్ప భవంతులేమీ కట్టుకోలేదు. గట్టిగా గాలొస్తే కుప్పకూలే రేకుల షెడ్డులే వారి ఆవాసాలు. కిరాయి కట్టే స్థోమతలేక నాలుగు గుంజలు పాతుకుని రేకులే కప్పులుగా గుడిసెలు నిర్మించుకున్నారు. పదిహేనేండ్ల నుంచి నివాసం ఉంటున్నారు. వీళ్లంతా పెద్ద భవంతుల యజమానుల ఇండ్లల్లో ఇంటి పని, కూలి పని చేసేటోళ్లే. రెక్కాడితే గానీ డొక్కాడని జీవితాలు. వచ్చిన ఆ కాస్త ఆదాయంలోనే ఇంటిల్లిపాది సంతోషంగా గడపటం నేర్చుకున్న మనుషులు. ఇలాంటి బక్కపల్చని బతకులపై కాంగ్రెస్ బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. ఇన్నేండ్లు అక్కడి నేలతో, ఇంటితో మెలేసుకున్న బంధాలను ఆ బుల్డోజర్లు తెంపేశాయి. ఈ వికృత చర్య ఫలితంగా నాలుగు రోజులుగా సున్నం చెరువు బాధితులు బిక్కుబిక్కుమంటూ కూలిన గోడలు, రేకుల షెడ్డుల మధ్యనే జీవనం సాగిస్తున్నారు.
బరువెక్కిన గుండె
రేవంత్ సర్కార్ చేసిన బుల్డోజర్ల యుద్ధంలో చితికిపోయిన ఆ కుటుంబాల చిన్నారులు వినాయక మండపాల్లో నిద్దురపోతున్నారు. ఈ దృశ్యాలు అందరిని కలచివేస్తున్నాయి. అంత కష్టాల్లోనూ తాను అపురూపంగా చూసుకుంటున్న పిల్లిని ఆప్యాయంగా హత్తుకుంటూ ఒడిలో కూర్చోబెట్టుకున్నదో చిన్నారి. ఈ దృశ్యం చూస్తే ఎవ్వరి కండ్లు అయినా చమ్మగిల్లకమానవు. తనకే గూడు లేక బయట ఉండే పరిస్థితిలోనూ మూగజీవికి తానున్నాననే భరోసానిచ్చిన ఆ చిట్టి గుండె దైర్యం ఎంతో గొప్పదో కదా! కూలిపోయిన శిథిలాల కింద కొంతమంది పిల్లలు పుస్తకాలు వెతుక్కుంటున్న దృశ్యాలు అక్కడి హృదయవిదాకర పరిస్థితులను కండ్లకు కడుతున్నాయి.
రాకాసి ప్రభుత్వం చేసిన గాయం మాన్పించే చేతుల కోసం వేడుకుంటున్నాయి. సున్నం చెరువుల బాధితుల కష్టాలు చూసిన అందరూ హైడ్రా చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. హైడ్రా నిర్వచనమే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. అలాంటిది చెరువుల పక్కన ఉన్నాయని పేదల ఇండ్లు కూల్చేస్తున్న సర్కారు.. పెద్ద పెద్ద భవంతులను మాత్రం ఎందుకు కూల్చటం లేదు? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
కూల్చివేతలు ఆపండి
దుండిగల్ మండలంలో నిర్మాణాలపై హైకోర్టు
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా, గండిమైసమ్మ-దుండిగల్ మండలం, మల్లంపల్లి గ్రామంలో నిర్మాణాలు పూర్తయిన విల్లాలను కూల్చరాదని హైకోర్టు ఇటీవల ప్రభుత్వానికి మధ్యంతర ఆదేశాలు జారీచేసింది. మల్లంపల్లి గ్రామ సర్వే నంబర్ 170/4లోని విల్లాలను కూల్చరాదని జిల్లా కలెక్టర్, దుండిగల్ ఎస్హెచ్ఓ, జిల్లా నీటిపారుదల శాఖ డీఈలను ఆదేశించింది. తదుపరి విచారణ జరిగే ఈ నెల 23వ తేదీ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని ఈ నెల 9న జస్టిస్ కే లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు మొత్తం 90 విల్లాల్లో 15 విల్లాలను ఈ నెల 8న కూల్చివేయడంతో మిగిలిన వాటిని కూల్చకుండా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ భాగస్వామి జీ కస్తూరిభాయ్ పిటిషన్ దాఖలు చేశారు.
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి లోని మల్లంపేట కత్వా చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో శ్రీలక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్మించిన 13 విల్లాలను హైడ్రా నేలమట్టం చేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉదయం ఆరు గంటలకు మొదలైన కూల్చివేతలు రాత్రి ఎనిమిదిన్నర వరకు కొనసాగాయి. కనీసం ఇంట్లో ఫర్నిచర్ తీసుకునేందుకు కూడా అధికారులు సమయం ఇవ్వలేదు. కేవలం ఎఫ్టీఎల్ పరిధిలోని నిర్మాణాలనే కూల్చివేస్తామని చెప్పిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బఫర్‌జోన్‌లోని నిర్మాణాలను ఎందుకు కూల్చివేశారంటూ బాధితులు ప్రశ్నించినా సమాధానం చెప్పే వారు లేరు. తమకు న్యాయం చేయండంటూ బాధితులు రంగనాథ్‌తో సమావేశమైతే… బిల్డర్‌పై కేసు వేసుకోండి! అని ఆయన ఉచిత సలహా ఇచ్చారు.
ఎన్హెచ్ఆర్సీకి బాధితుల ఫిర్యాదు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైడ్రా చేతిలో ఇండ్లు నేలమట్టమైన మాదాపూర్ సున్నంచెరువు ప్రాంతంలోని సరోజినీనాయుడునగర్కు చెందిన పేదలు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. గత పదిహేనేండ్లుగా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వం ఈ నెల 8న తమ ఇండ్లను కూల్చివేసిందని ఫిర్యాదుచేశారు. తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అధికారులతో, పోలీసు బందోబస్తు మధ్య తమ గుడిసెలు కూల్చివేసిందని బాధితులు వీ వెంకటేశ్, బాడిగ రాజు, ఎం ఆంజనేయులు, వీ తార, నరేశ్ కమిషన్ దృష్టికి తెచ్చారు. తమ సామాన్లు, విలువైన వస్తువులు, చివరకు పిల్లల పుస్తకాలను తీసుకునే సమయం కూడా హైడ్రా అధికారులు ఇవ్వలేదని తెలిపారు.
తమ నివాసాల కూల్చివేతల తర్వాత నీడ, ఆహారం, తాగడానికి మంచినీరు కోసం ఎదురుచూశామని, కానీ ప్రభుత్వం ఎలాంటి సహాయ చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నివాసితుల ఇండ్లను కూల్చివేయడం.. రాజ్యాంగబద్ధంగా జీవించే హక్కును కాలరాయడమేనని పేర్కొన్నారు. ఇక్కడ మానవ హక్కుల ఉల్లంఘన స్పష్టంగా జరిగిందని, గుడిసెల కూల్చివేతల కారణంగా నష్టపోయిన పేదలకు ప్రభుత్వం తక్షణ నష్టపరిహారాన్ని అందించాలని, పునరావాసం కోసం మరొక ప్రాంతంలో ఇండ్ల స్థలాలిచ్చి గృహ నిర్మాణాలకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. గుడిసెల కూల్చివేతల అనంతరం పోలీసులు బాధితులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పేదల నుంచి ఫిర్యాదు నం. 14820/IN/2024 అందినట్టు జాతీయ మానవ హక్కుల కమిషన్ ధ్రువీకరించింది.
స్తంభించిన హెచ్ఎండీఏ ఆన్లైన్ సేవలు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ పరిధిలో ఆన్లైన్ సేవలు స్తంభించిపోయాయి. స్టేట్ డాటా సెంటర్లో తలెత్తిన టెక్నికల్ సమస్యల కారణంగా ఆన్లైన్ సేవలు నిలిచిపోయి దరఖాస్తుదారులు ఇబ్బంది పడ్డారు. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలోనే వెబ్‌సైట్‌కు సందర్శకుల తాకిడి పెరిగి హెచ్ఎండీఏ కోర్ వెబ్‌సైట్‌పై ప్రభావం పడినట్టు వెల్లడైంది. హెచ్ఎండీఏ, లేక్స్ వెబ్సైట్ మంగళవారం మధ్యాహ్నాం నుంచి నిలిచిపోగా బుధవారం సాయంత్రం నాటికి క్రాష్ అయిందని తెలిసింది. కనిపించకుండా పోయిన హెచ్ఎండీఏ వెబ్‌సైట్‌ను వెతికిపెట్టాలని డీజీపీని పౌర హక్కుల నేత లుబ్నా సార్వత్ కోరారు.