హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ) : రాజకీయ విలువలుంటే, దమ్ముంటే కాంగ్రెస్‌లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆ పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు. పార్టీ మారేందుకు పోచారం చెప్తున్న కారణాలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నదని దుయ్యబట్టారు. పోచారం రాజీనామా చేస్తే తానే ఆయనపై పోటీ చేస్తానని ప్రకటించారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్, బీఆర్ఎస్ నేత అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి బాజిరెడ్డి శుక్రవారం మీడియా సమావేశం మాట్లాడారు.
రేవంత్‌రెడ్డి వ్యవసాయానికి చేస్తున్న మేలును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు పోచారం చెప్పడం ఆత్మవంచనే అని, రైతులకు ద్రోహం చేస్తున్న రేవంత్‌రెడ్డి తీరును పోచారం ఎందుకు మరచిపోయారోనని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాన్సువాడ ప్రచారంలో పోచారం కుటుంబాన్ని రేవంత్ దండుపాళ్యం బ్యాచ్‌తో పోల్చారని, ఆయన నాయకత్వంలోనే పార్టీ మారడం నిజంగా ఆశ్చర్యంగా ఉందన్నారు. కేసీఆర్ పోచారానికి స్పీకర్, మంత్రి పదవులిచ్చి గౌరవించారని గుర్తుచేశారు. పోచారం పార్టీ మారడం వల్ల బీఆర్ఎస్కు నష్టమేమి లేదని, కాంగ్రెస్‌కు కూడా లాభం ఉండదని చెప్పారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక రేవంత్‌రెడ్డి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, ఆరు నెలల్లోనే రేవంత్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఓటుకు నోటు దొంగ రేవంత్ మళ్లీ అవే రాజకీయాలు మొదలు పెట్టారని, రేవంత్ ఆటలు ఇక సాగవని హెచ్చరించారు.