హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఓటర్లను తప్పుదోవ పట్టించే విధంగా ఫోర్జరీ లేఖను ట్విట్టర్లో పోస్ట్చేసిన సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బుధవారం బీఆర్కేఆర్ భవన్లో సీఈవో వికాస్‌రాజ్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ సీనియర్ నేత సోమ భరత్‌కుమార్ వినతిపత్రం అందజేశారు. 2023లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉస్మాని యా వర్సిటీ హాస్టళ్లకు కరెంటు కోత, నీటి సరఫరా లేని కారణంగా సెలవులు ఇస్తున్నామంటూ పేర్కొన్నట్టు సృష్టించిన ఫోర్జరీ లేఖను రేవంత్‌రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
వాస్తవంగా ఆయా కారణాలతో హాస్టళ్లను మూసివేస్తున్నట్టుగా వర్సిటీ అధికారులు ఆదేశాలను ఇవ్వలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఫోర్జరీ లేఖ తయారు చేసి ట్విట్టర్లో రేవంత్‌రెడ్డి పోస్ట్ చేశారని తెలిపారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘంచి ఒక రాజకీయ పార్టీపై తప్పుడు ప్రచారం చేసే విధంగా వ్యవహరించిన రేవంత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడానికి, ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్పై తప్పుడు లేఖలతో ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజలను, ఓటర్లను, ఓయూ విద్యార్థులను అయోమయానికి గురిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని వివరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, మే 1: నిరుడు ఓయూలో ఇచ్చిన సెలవుల సర్క్యులర్‌ను మార్పిడి చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ పోలీస్‌స్టేషన్‌లో విద్యార్థులు ఫిర్యాదు చేశారు. తొలుత రేవంత్‌రెడ్డి వైఖరికి నిరసనగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులు నిరసన తెలిపారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ మాట్లాడుతూ.. ఫేక్ సర్క్యులర్‌ను సోషల్ మీడియాలో ఉంచిన రేవంత్‌పై కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని దశరథ్ డిమాండ్ చేశారు.