KCR | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేయడం అమానవీయ చర్యని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల నుంచి కశ్మీర్ సందర్శనకు వచ్చిన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్యని విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ఆదుకుని అండగా నిలవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కేంద్రాన్ని కోరారు. జమ్మూకశ్మీర్ లో టెర్రరిస్టుల మారణకాండ పునరావృతం కాకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. శోకతప్తులైన వారి కుటుంబీకులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఉగ్రదాడిని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ఖండించారు.
హేయమైన చర్య: కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పర్యాటకుల ప్రాణాలు తీయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. ఈ పాశవిక దాడిలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలన్నారు. ఈ అమానుష దాడిలో ఆప్తులను కోల్పోయిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలువాలన్నారు. కశ్మీర్లో ఉగ్రవాద మూకలకు స్థానం లేదన్న సందేశాన్ని బలంగా ఇవ్వాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు.
ఉగ్రవాదంపై కలిసి పోరాడాలి: హరీశ్‌రావు
జమ్మూ కశ్మీర్లో ఉగ్రమూకలు పర్యాటకులను హతమార్చిన విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ ద్వారా తెలిపారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అమాయకులు బలి : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
జమ్మూకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంగళవారం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎక్స్ ద్వారా తెలిపారు. ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులను బలి తీసుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.