KCR : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో ఆగమాగం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరెంటు కోతలు పెరిగిపోయాయని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు అధ్వాన్నంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దామని, ఇప్పుడు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఐదారు నెలల్లోనే మళ్లీ అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు.
‘తెలంగాణ ఏర్పడిన తొలి రోజుల్లో కరెంటు బాధలు వర్ణణాతీతం. అది మనందరికి తెలుసు. కళ్లారా చూసినం. పవర్ హాలిడేస్‌తో చాలా ఇబ్బందులు పడుతున్నమని ఇందిరాపార్కు దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిండ్రు. పటాన్చెరు, చర్లపల్లి ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నాలు చేసిన పరిస్థితులు చూసినం. రైతాంగం మోటార్లు పెడుతందుకు రాత్రిళ్లు బావుల కాడికి పోవడం, కరెంటు షాకులు కొట్టి చనిపోవడం, పాములు కరిచి చనిపోవడం లాంటి పరిస్థితులు చూసినం’ అని కేసీఆర్ గుర్తుచేశారు.
‘బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగైదు నెలల్లోనే వ్యవసాయం మినహా మిగతా అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడం మొదలుపెట్టినం. ఏడాదింబావు (15 నెలలు) వ్యవధిలోనే వ్యవసాయానికి కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం స్టార్ట్ చేసినం. ఏడు వేల మెగావాట్లు ఉన్న విద్యుత్ శక్తిని 21 వేల మెగావాట్లకు పెంచినం. ఇంకా మంచిగ చెప్పాల్నంటే దేశంలోని 28 రాష్ట్రాల్లో గూడా అన్ని రంగాలకు నిరాటంకంగా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి రాష్ట్రాన్ని తీసుకపోయినం’ అని కేసీఆర్ చెప్పారు.
‘అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో, కేవలం ఐదారు నెలల్లో ఇంత ఘోరమైన స్థితికి చేర్చిండ్రు. నేను లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బస్సు యాత్ర చేసినప్పుడు బస చేసిన ప్రాంతాల్లో ఏడెనిమిది సార్లు కరెంటు పోయింది. ఈ విషయాన్ని నేను ఒకసారి ట్విట్టర్లో కూడా ప్రస్తావించిన. కానీ కరెంటు పోతలేదని, అది నిజం కాదని పిచ్చోళ్ల లెక్క మాట్లాడిండ్రు. దాంతోటి నా ఇమేజ్ను డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం లేక ఇగ ట్విట్టర్ల పెట్టుడు మానేసిన. కరెంటు కోతలవల్ల ఊర్లళ్లలో మళ్లీ రైతులు షాకులు కొట్టి చనిపోవడం, పాములు కరిచి చనిపోవడం, పంటలు ఎండిపోవడం లాంటివి చూస్తున్నం’ అని బీఆర్ఎస్ అధినేత అన్నారు.