KCR | హైదరాబాద్ : పదేండ్లలో తెలంగాణను దగదగలాడే విధంగా, అందరూ ఆశ్చర్యపోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
“జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి” శ్రీరామచంద్రుడు లంక మీద యుద్ధం చేసి రావణ సంహరం చేసి అయోధ్యకు తిరిగి రావాలనే ఆలోచనలో ఉన్నప్పుడు రాములవారి సోదరుడు లక్ష్మణుడు సహా చాలా మంది పెద్దలు లంక చాలా సువర్ణమయంగా ఉంది.. అద్భుతంగా ఉంది.. ఇంక మనం అయోధ్యకు ఎందుకు ఇక్కడ్నుంచే పరిపాలన చేద్దాం అంటారు.. దానికి శ్రీరామచంద్రుడు ఒప్పుకోరు.. కన్నతల్లిని, జన్మభూమిని మించినటువంటి స్వర్గం ఏది కూడా ఉండదు. కాబట్టి మనం అయోధ్యకే తరలిపోవాలని చెప్పి తిరిగి వచ్చారు అని కేసీఆర్ గుర్తు చేశారు.
అదే స్ఫూర్తితో, చాలా గందరగోళ పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉన్నటువంటి.. ఆత్మహత్యలకు అలవాలమైన, వలసలకు నిలయమైనటువంటి.. వలసవాదుల విషకౌగిలిలో నలిగిపోతున్నటువంటి తెలంగాణను ఎట్టి పరిస్థితుల్లో విముక్తి చేయాలని స్వరాష్ట్రం సాధించాలని, జననీని, జన్మభూమిని మించింది లేదని చెప్పి నేను ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. 25 ఏండ్ల క్రితం ఎగిరిన జెండా ఈ గులాబీ జెండా. చాలా మంది అవమానపరిచారు. ఎన్నో మాటలు అన్నారు. ఎగతాళి, అవహేళన చేశారు. మఖలో పుట్టింది పుబ్బలో పోతదని అన్నారు. కానీ అనేక మంది త్యాగాలతోని, వందలాది మంది బలిదానాలతోని, అనేక ఉద్యమాలతోని యావత్ తెలంగాణ అద్భుతమైన ఉద్యమమై ఎగిసిపడింది. ఒక సమయంలో తెలంగాణ యావత్ ఒక పక్కన నిల్చుని బరిగీసి నా తెలంగాణ అక్కడ పెట్టు అని నిలబడ్డ సందర్భం సృష్టించాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.
ప్రజలు దీవిస్తే అద్భుతమైన పదేండ్ల పాటు దగదగాలాడే తెలంగాణను తయారు చేసి, అందరూ బిత్తరపోయే విధంగా, ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణను నిర్మాణం చేసుకున్నాం. 25 ఏండ్ల సుధీర్ఘ చరిత్రను ఇవాళ రజతోత్సవ సందర్భంగా వరంగల్లో జరుపుకుంటున్నాం. ఇప్పుడు కూడా కొందరు అడ్డుకుంటున్నారు. ఈ గడ్డకు ప్రత్యేకత ఉంది. రాణి రుద్రమ ఏలిన వీరడగ్డ. సమ్మక సారక్కల పోరగుడ్డ, బమ్మెర పోతన కవిత మాధుర్యం పండించిన జీవగడ్డ.. ఈ వరంగల్ నేలకు వందనం చేస్తున్నా. మన అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నా అని కేసీఆర్ పేర్కొన్నారు.