KCR | హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేసీఆర్ సెటైర్లు వేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాయ రోగం వచ్చే.. ఎన్నెన్ని చెప్పిరి అంటూ ఎద్దెవా చేశారు కేసీఆర్. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్ సర్కార్‌కు ఏడాదిన్నర అయింది.. ఏ మాయం రోగం వచ్చే.. ఏం బీమారి వచ్చే.. ఏమేమి చెప్పిరి.. ఎన్నెన్ని చెప్పిరి.. మీకు కావాల్సింది ఇదే కదా చెప్తా ఇగ.. వాళ్ల కథ చెప్పే ముందు మన కథ కూడా చెప్పాలి కదా.. ఏమేమి మాటలు మాట్లాడిండ్రు. వరుసబట్టి గోల్ మాల్ దింపుట్ల, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినోడు లేరు. ఇక్కడ ఉన్నోళ్లు చాలరని చెప్పి ఉన్న గాంధీలు, లేని గాంధీలు, డూప్లికేట్ గాంధీలు ఢిల్లీకెళ్లి దిగారు. స్టేజీల మీద డ్యాన్స్‌లు చేశారు అని కేసీఆర్ ఎద్దెవా చేశారు.
కేసీఆర్ రైతు బంధు కింద ఏం ఇస్తుండు.. పదివేలు ఇస్తుండు.. మేం 15 వేలు ఇస్తామని చెప్పిండ్రు. పెన్షన్లు 2 వేలు ఇస్తుండు మేం 4 వేలు ఇస్తామని చెప్పిండ్రు. ఇద్దరు ఉంటే ఒక్కరికే ఇస్తుండు.. మేం ముసలిది ముసలోడికి ఇద్దరం ఇస్తమని చెప్పిండ్రు.. ఇవన్నీ కాంగ్రెసోళ్లు చెప్పిండ్రు కదా.. దివ్యాంగులకు కేసీఆర్ 4 వేలు ఇస్తుండు మేం 6 వేలు ఇస్తమండ్రు. ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తామన్నారు. విద్యార్థులకు విద్యాకార్డు కింద ఐదు లక్ష్యల గ్యారెంటీ కార్డు ఇస్తామని ఎన్నో మాటలు చెప్పిండ్రు. ఇక ఒకరి వెనుక ఒకరు ఉరిచి.. 2 లక్షల లోన్ తెచ్చుకోండి డిసెంబర్ 9న ఒక కలంపోటుతో ఖతం చేస్తా అని అన్నారు. చేసిండ్రా అంటే చేయలేదు అని కేసీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం.. వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి కనీస మద్దతు ధర వచ్చేలా.. తడిసినా, రంగు పోయినా, మొలక వచ్చినా.. రైతులు, మన బిడ్డలు కాబట్టి గవర్నమెంట్‌కు 5 వేల కోట్ల నష్టం వచ్చినా కొన్నాం.. బాధకలేదు. కాంగ్రెసోళ్లేమో పబ్లిక్‌ను బొల్తా కొట్టించేందుకు క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. దీంతో పాటు 420 హామీలు చెప్పారు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ లక్షా నూటపదహార్లు ఇస్తున్నడు.. మేం తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు. ఎక్కడన్న వస్తుందా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
హామీలు ఇచ్చుడు కాదు.. పెద్ద పెద్ద బుక్కులు ఊరురా పంచిండ్రు. సిగ్గు లేకుండా బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు. అడ్డగోలుగా హామీలు ఇచ్చిండ్రు.. యేడికెళ్లి ఇస్తారని కాంగ్రెస్ నేతలను అడిగితే.. చేసి చూపిస్తాం.. మాది పెద్ద పార్టీ.. మమ్మల్ని మించిన సిపాయిలు లేరని ఒకడు జబ్బలు చరిచారు.. ఒకడు మెడలు చరిచాడు. డైలాగులు మీద డైలాగులు కొట్టి ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా లేదు.. రుణమాఫీ చేయలేదు. మధ్యలో ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి.. నాకు కాళ్లు విరిగింది.. అయినా నేను బయల్దేరాను.. దీంతో తెలంగాణలో ఎన్ని దేవుండ్లు ఉంటే అన్ని దేవుళ్ల మీద ఒట్టు పెట్టిండ్రు. ఇన్ని మాటలు చెప్పి మోసం చేశారు. ఉచిత బస్సు అని పెడితే జుట్లు పట్టుకుని కొట్టుకునేందుకు పనికి వస్తుంది తప్ప ఉపయోగం లేదు. ఈ ఉచిత బస్సు మాకు అవసరం లేదు అని ఆడబిడ్డలు అంటున్నారు. ఊ అంటే ఆ అంటే అబద్దాలు చెబుతున్నారు. మాట్లాడితే బీఆర్ఎస్, కేసీఆర్ మీద నింద వేస్తున్నారు. అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఘోరంగా మోసం చేస్తున్నారు అని కేసీఆర్ ధ్వజమెత్తారు.