KCR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇండ్లను కూలగొడుతున్న బుల్డోజర్లపై మౌనంగా ఉందామా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.
ఎల్కతుర్తి బీఆర్ఎస్ మీటింగ్‌లో కేసీఆర్ ప్రసంగిస్తూ.. పేదలు తెలిసీ తెలియక ప్రభుత్వ జాగల్లో గుడిసెలు వేసుకుంటారు. వరంగల్, హైదరాబాద్‌తో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో లక్షలాది మందికి పట్టాలిచ్చాం. బుల్డోజర్లు పెట్టి, జేసీబీలు పెట్టి మేం చెరువుల్లో పూడికలు తీస్తే వీళ్లెమో హైడ్రా అని, వాని బొందా అని పెట్టి పేదల ఇండ్లు కూలగొడుతున్నరు. ఆనాడు చెరువుల పూడికలు తీసిన బుల్డోజర్లు ఇవాళ పేదల ఇండ్లు కూలగొడుతున్నాయి. ఇవన్నీ మనం చూస్తున్నాం. చూసి మౌనంగా ఉందామా..? కొట్లాడుదామా..? ఏం చేద్దామనే ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని కేసీఆర్ అన్నారు.
దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇవాళ 15వ స్థానానికి కాంగ్రెసోళ్లు తీసుకుపోయారు. నా కళ్ల ముందే ఇంత మోసం చేస్తారని అనుకోలేదు.. బాధ కలుగుతుంది.. ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనక్కి పోతుంది. దీనికి కారణం కాంగ్రెస్ దుర్మార్గులది. మాకు ఏడాదైనా టైమ్ ఇవ్వారా అంటరు అని నోరు తెరవలేదు. బయటకు రాలేదు. కృష్ణా జలాల మీద నల్లగొండలో పోయి గర్జన చేసి వచ్చాను. ఇక ఎక్కడ బయటకు రాలేదు.. మాట్లాడలేదు. కానీ ఏడాదిన్నర అయిపోయింది పువ్వు పుట్టంగానే పరిమళిస్తది అన్నట్టు ప్రభుత్వం కథ తెల్వదా.. వీళ్లకు టైం ఎక్కడిది.. ఇక ఉన్నది రెండున్నరేండ్లు.. అందుకోసం ప్రజానీకం ఆలోచన చేయాలి. దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి. ఆవేశంతో కాకుండా మేధావితనంతో పని చేయాలి. ముళ్లును ముళ్లుతోనే తీయాలి. పొగోట్టుకున్నతోనే వెతకాలి.. ఎక్కడ జారిపోయిందో అక్కడే పట్టుకోవాలి.. ఆ నైపుణ్యం రావాలి అని కేసీఆర్ అన్నారు.
ఇవాళ భూముల ధరలు పడిపోయాయి. ఆలోచన చేయాలి మీరందరూ.. రాజ్యం నడప చేతగాక రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీశారు. అన్ని రంగాల్లో ఫెయిలయ్యారు. బీఆర్ఎస్ హయాంలోనే గౌరెల్లి ప్రాజెక్టు 90 శాతం పూర్తయింది.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తట్టెడు మన్ను తీయలేదు. పాలమూరు పథకం 80 శాతం పూర్తయింది.. మిగతా పనులు ఎందుకు పూర్తి చేయట్లేదు. కేసీఆర్ కిట్ పెట్టినం.. కోటీశ్వరుల కోసం కాదు.. పేద ప్రజల కోసం పెట్టినం. ఆడపిల్లను కంటే 13 వేలు, మగపిల్లాడిని కంటే 12 వేలు ఇచ్చాం. అమ్మ ఒడి వాహనాలు పెట్టి ప్రసవాలు చేయించి.. మళ్లీ ఇంటికాడ దించినం. దాన్ని బంద్ చేస్తారా… ముఖ్యమంత్రిగా పని చేసేటోళ్లకు గాంభీర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి.. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్య శ్రీ తీసుకొచ్చిండు.. నేను సీఎం అయ్యాక ఆ పథకం గురించి అడిగితే ప్రజలకు లాభం అయితదని అధికారులు చెప్పితే దాన్ని కొనసాగించాలని చెప్పాను. అక్కడ చెప్పడం కాదు.. అసెంబ్లీలో కూడా ప్రకటించాను.. ఇది మా స్కీం కాదు.. కాంగ్రెస్ స్కీం అని చెప్పి కొనసాగించాను. కానీ వీళ్లు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారట అని కేసీఆర్ ధ్వజమెత్తారు.