KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు. తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతో పాటు, దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా.. విజయ దశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనంలో ప్రత్యేక స్థానం ఉన్నదని కేసీఆర్ అన్నారు.
కార్యధీక్షులను అపజయాల నుంచి విజయాల దిశగా నడిపిస్తూ, ఏనాటికైనా ధర్మానిదే అసలు విజయం అనే స్ఫూర్తిని దసరా పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దసరా పండుగ విశిష్టతను గౌరవిస్తూ, జమ్మి చెట్టును రాష్ట్ర వృక్షంగా, పాలపిట్టను రాష్ట్ర పక్షిగా, నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిందని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో బతుకమ్మతో పాటు విజయ దశమి స్ఫూర్తి ఇమిడి ఉన్నదని, అదే స్ఫూర్తితో పదేండ్ల పాలనలో ప్రజలను ప్రగతి విజయాల దిశగా నడిపించామన్నారు. ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తాము ఎంచుకున్న లక్ష్యాలను చేరుకుని, నిత్య శుభాలతో ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నిండేలా దీవించాలని దుర్గా మాతను కేసీఆర్ ప్రార్థించారు.