KCR : సరైనా పంథా లేకపోవడంవల్లే 1969 ఉద్యమం విఫలమైందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తుచేశారు. ఆ రోజుల్లో తెలంగాణ అనే పదాన్నే పలకవద్దని అప్పటి స్పీకర్ ప్రణయ్ భాస్కర్ అసెంబ్లీలో అన్నారని చెప్పారు. తెలంగాణ అనడానికి బదులుగా వెనుకబడిన ప్రాంతం అని చెప్పాలని ఆయన స్పీకర్ స్థానంలో ఉండి వ్యాఖ్యానించారన్నారు. ఇక్కడి భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందరు హేళన చేశారని తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు.
‘నాడు ఉవ్వెత్తిన ఎగిసిపడ్డ 1969 ఉద్యమం సరైన పంథా లేకపోవడంవల్ల ఘోరంగా విఫలమైంది. అయినా జయశంకర్ తన పోరాట పంథాను వీడలేదు. తెలంగాణకు జరిగే అన్యాయాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తూ వచ్చారు. 1969 ఉద్యమంలో ముల్కీ రూల్స్ ప్రధాన అంశంగా ఉండేది. ఆంధ్రాప్రాంత ఉద్యోగులను ఇక్కడి నుంచి పంపించాలని ఇక్కడ యువత పోరాటం చేశారు. ఈ ముల్కీ రూల్స్ వ్యతిరేక పోరాటంలో రాజ్‌భవన్ దగ్గర 8 మంది విద్యార్థులను కాల్చిచంపారు. ఉద్యమం సమసిపోయింది. తెలంగాణ రాలేదు’ అని కేసీఆర్ అన్నారు.
‘ఆ తర్వాత పీవీ నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. ముల్కీ రూల్స్ ఉద్యమం లీగల్ బ్యాటిల్‌గా సుప్రీంకోర్టుకు వెళ్లింది. పీవీ ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్‌లో 1973లో.. ముల్కీ రూల్స్ కొనసాగుతాయని తెలంగాణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. దాంతోటి ఆంధ్రాలో వెంటనే జై ఆంధ్రా ఉద్యమం మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత కేంద్రం సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. ముల్కీ రూల్స్‌ను రద్దుచేసింది. ఇంత చేసినా తెలంగాణ నుంచి ఎవరూ నోరు మెదపలే. మారు మాట్లాడలే. ఆనాడు ఆమోస్ అని టీఎన్జీవో అధ్యక్షుడు ఉండె. ఆయనను కూడా భయంకరంగా వేధించారు. పీడీ యాక్ట్‌పెట్టారు. ఉద్యోగం నుంచి తొలగించారు. నెలల తరబడి జైల్లో పెట్టారు. అయినా ఆయన రాజీపడలే. ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు’ అని కేసీఆర్ చెప్పారు.
‘బీఆర్ఎస్ మహావృక్షం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్నాం. కానీ ఆ తర్వాత బస్సు యాత్ర మొదలుపెట్టంగనే మళ్లీ అదే గర్జన కనిపించింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీఆరెస్సే. చేప పిల్లలు, గొర్రె పిల్లలను పంపిణీ చేస్తే అపహాస్యం చేశారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్ఠం చేశాం. కేవలం 1.08 శాతం ఓట్ల తేడాతో ఓడిపోయాం. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. రాజకీయం నిరంతర ప్రవాహం. అధికారంలో ఉంటేనే రాజకీయం కాదు. ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం. సీఎం సొంత జిల్లా మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాం’ అని కేసీఆర్ అన్నారు.