Fake News | సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చండీయాగం నిర్వహిస్తున్నారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేసీఆర్ పీఆర్వో రమేశ్ హజారి ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ చండీయాగం గురించి కేసీఆర్ కార్యాలయం నుంచి గానీ, బీఆర్ఎస్ కార్యాలయాల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని తెలిపారు. అయినప్పటికీ కనీస సమాచారం తెలుసుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
వాస్తవాలను నిర్ధారించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా ఫామ్‌హౌస్‌లో చండీయాగం అంటూ ప్రముఖ ఛానళ్లు, పత్రికలు ఈ దుష్ప్రచారాన్ని కొనసాగించడం బాధ్యతారాహిత్యం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా, కేసీఆర్ ప్రతిష్ఠను భంగపరిచే విధంగా కొనసాగిస్తున్న ఇటువంటి అవాస్తవాలను, అసత్యాలను, వార్తల పేరుతో చేసే దుష్ప్రచారాన్ని తక్షణమే నిలిపివేయాలన్నారు. తమ తమ ఛానళ్ల నుంచి ఈ వార్తలను తొలగించాలని అన్ని పత్రికలు, ఛానెళ్ల యాజమాన్యాలను, ఎడిటర్లను కోరారు.