అధికారం శాశ్వతం కాదు.. అభిమానం ఎక్కడున్నా ఆగదు. కేసీఆర్.. ఈ మూడక్షరాలు తెలంగాణకు కొండంత ధైర్యం. ఆయన రెండ్రోజులు కనబడకపోతే బెంగటిల్లే జనం లక్షల్లో ఉంటారు. ఫలితాల తర్వాత నిరాడంబరంగా ప్రగతిభవన్‌ను వదిలి ఎర్రవల్లి ఇంటికి వెళ్లిపోయారు కేసీఆర్. తండ్రి కానరాక బిడ్డ బెంగటిల్లినట్టు, తల్లికోసం పసిపాప గుక్కపట్టినట్టుగా ఉంది ఆయన సొంతూరు చింతమడక పరిస్థితి.
అందుకే గుండెబరువుతో ఊరు ఊరంతా కేసీఆర్ ఇంటికి 9 బస్సుల్లో తరలివచ్చింది. గేట్లు తీయగానే.. గేట్లెత్తిన నదిలా జనం పరుగుతీశారు. కేసీఆర్‌ను కలిసినప్పుడు వారిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంది. ప్రియనేతను చూసిన ఆనందమూ, ఆ స్థితిలో చూడటంతో పెల్లుబికిన దుఃఖమూ కలగలిసిన ఉద్విగ్న క్షణాలవి. కండ్లలో కన్నీటి పొర, జోడించిన వందల చేతులు.. చింతమడకకే కాదు, యావత్ తెలంగాణకు ఆయన ఏంచేశారో, ఎంత తపించారో చెప్తున్నాయి. అధికార సౌధం వదిలినా.. అభిమాన ధనం తరగదనడానికి ఇదే నిదర్శనం.
KCR | హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ):కేసీఆర్.. ఆ పేరు వింటేనే ఓ ఉద్వేగం. ప్రత్యక్షంగా చూస్తే ఓ భావోద్వేగం. అది ఉద్యమమైనా, బహిరంగ సభ అయినా, ఆఖరికి టీవీలో ఆ స్వరం వింటే ఆత్మవిశ్వాసం. ఆయన మాటే కొండంత భరోసా. ఇంకా చెప్పాలంటే, కేసీఆర్.. అంటే ఒక ఎమోషన్. అది ఉద్యమమైనా, పరిపాలనైనా! ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు ఇమేజ్ తెచ్చింది ఈ మూడు అక్షరాలే. ఉద్యమాన్ని ఉరకలెత్తించినా, అభివృద్ధిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లినా జననేతకే సాధ్యమయ్యిం ది.
అందుకే ఆయనపై తరగని ప్రేమాభిమానాలు జనం గుండెల్లో ఎల్లకాలం ఉంటాయని రుజువు చేసే దృశ్యాలు సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని ఎర్రవల్లిలో రోజూ ఆవిష్కృతమవుతున్నాయి. ప్రజా శ్రేయస్సే శ్వాసగా పాలన సాగించిన పాలనాదక్షుడు కేసీఆర్.. అధికారంలో లేకపోవటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండె లయ తప్పుతున్నంత ఆందోళన కేసీఆర్ సొంతూరు చింతమడకవాసుల్లో కనిపించింది. అందుకే ఊరంతా దండులాగా బుధవారం ఎర్రవల్లికి పోటెత్తారు. సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ఒక్కసారిగా వందల మందిని వ్యవసాయ క్షేత్రంలోకి పంపించటం సాధ్యంకాదని పోలీసులు చెప్పినా వినకుండా ససేమిరా అన్నారు. ప్రజలు పట్టుబట్టడంతో గేటు తెరవక తప్పలేదు పోలీసులకు. చింతమడక నుంచి ప్రత్యేక బస్సుల్లో వేలాదిగా ప్రజ లు తరలివచ్చారు.
బస్సు దిగగానే పెద్దఎత్తున ‘జై కేసీఆర్’ అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముం దుకురికిన దృశ్యాలు కనిపించాయి. కేసీఆర్‌ను చూడగానే దండాలయ్యా.. నువ్వే ఉండాలయ్యా… అం టూ గుండెల్లో గూడు కట్టుకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తన కోసం తరలివచ్చిన ప్రజలకు అధినేత కేసీఆర్ అభివాదం చేశారు. తన గ్రామస్థులను ఆప్యాయంగా పలుకరించారు. మూ డు రోజులుగా ఎర్రవల్లిలో ఉన్న నివాసానికి పార్టీ నేతలు, ప్రజలు, వివిధ రంగాల ప్రముఖులు చేరుకుంటున్నారు. జననేతను కలిసి భావోద్వేగానికి గురవుతున్నారు.