KCR | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలమైన పునాదులను మరింత పటిష్టం చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు. వారం పదిరోజులుగా క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని కార్యకర్తలందరూ పార్టీతోనే ఉన్నారు. పదవి కోసం, పైరవీల కోసం ఎమ్మెల్యేలు పార్టీ మారితే తామెందుకు మారుతామని వారు ప్రశ్నిస్తున్నారు.
నాడు కేసీఆర్ సారథ్యంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని, అన్ని సందర్భాల్లోనూ ఆయన వెంటే ఉన్నామని, ఇకపైనా ఆయనతోనే ఉంటామని చెప్తున్నారు. 2004-06 మధ్య బీఆర్ఎస్ నుంచి గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారి తెలంగాణను ఆగం చేయాలని చూసినా కేసీఆర్ మొండిపట్టుదలతో ముందుకు సాగిన వైనాన్ని గుర్తుచేస్తున్నారు. అప్పటితో పోలిస్తే పార్టీ ఇప్పుడు వెయ్యిరెట్లు బలంగా ఉన్నదని పేర్కొంటున్నారు. పార్టీ వీడిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ ఉద్యమంలో మమేకమైన పార్టీ నాయకులతో కేసీఆర్ లోతుగా చర్చిస్తున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తల బలం మరే పార్టీకి లేదు. సాధారణ సభ్యులే 60 నుంచి 65 లక్షల మంది ఉన్నారు. ఏ పార్టీకి లేనివిధంగా అన్ని జిల్లాల్లో (ఒకటి రెండు జిల్లాలు మినహా) పార్టీకి సొంత కార్యాలయాలున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కరుడుగట్టిన తెలంగాణవాదుల అండ బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా, లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా రాకపోయినా పార్టీ శ్రేణులు ఎక్కడా నైరాశ్యం ప్రదర్శించలేదు. మరోవైపు, బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గ్రామస్థాయి నుంచి నియోజకవర్గస్థాయి దాకా గులాబీ సైనికులు పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేలను నియోజకవర్గాలకు రానివ్వకుండా అడ్డుకుంటామని ప్రతినబూనుతున్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాలతో సదరు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోనో, ఢిల్లీలోనో తలదాచుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకోవైపు, పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఎంపిక చేసిన నియోజకవర్గాల నుంచే రావాలని పార్టీ పేర్కొన్నది. తన దగ్గరికి వస్తున్న పార్టీ శ్రేణులు, ముఖ్యనాయకులతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ సమాలోచనలు జరుపుతున్నారు.
‘తెలంగాణ కోసం 25 ఏండ్లుగా ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో భాగమయ్యాం. తెలంగాణతో గులాబీ సైనికులది తల్లీబిడ్డల బంధం. దశాబ్దాల దోపిడీ, ద్రోహం నుంచి తల్లిని కాపాడిన బిడ్డలుగా మిగతా వారికంటే మనకే బంధం, బాధ్యత ఉన్నాయి’ అని పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రోజురోజుకు దిగజారుతున్నదన్న భావన ప్రజల్లో నెలకొన్న నేపథ్యంలో వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి భరోసా కల్పించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయించాల్సిన బాధ్యత బీఆర్ఎస్పైనే ఉన్నదని దిశానిర్దేశనం చేస్తున్నారు. కష్టపడి దరికి తెచ్చిన రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో దారి తప్పిందని పార్టీ శ్రేణుల వద్ద కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్యమ కాలంలో అనుసరించిన స్ఫూర్తిని ప్రదర్శించాలని పార్టీ శ్రేణులకు కేసీఆర్ కర్తవ్యబోధ చేస్తున్నారు. ‘మనం రెట్టించిన ఉత్సాహంతో భవిష్యత్తులో ప్రజల కోసం ఇంకా బాగా పనిచేయాల్సి ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘కులమతాలకు అతీతంగా పనిచేస్తూ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ ప్రజా సమస్యలకు పరిషారం చూపినం. కులవృత్తులను బాగుచేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినం’ అని బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేసీఆర్ గుర్తుచేస్తున్నారు.
‘ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడొద్దు’ అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి. ‘అధికారం ఉంటేనే పనిచేస్తామనడం పద్ధతికాదు. మనం ఏ హోదాలో ఉన్నా ప్రజల కోసం పనిచేయాల్సిందే. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమే’ అని ఆయన పేర్కొన్న విషయాన్ని పార్టీ నాయకులు ఉదహరిస్తున్నారు. మొత్తంగా జరుగుతున్న పరిణామాలను అంచనా వేసి అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించే పనిలో కేసీఆర్ నిమగ్నం అయ్యారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.