హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : బక్రీద్ త్యాగానికి, దానగుణానికి ప్రతీక అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా ఇస్లాం ఆరాధకులు బక్రీద్‌ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారని తెలిపారు. బక్రీద్ (ఈద్-ఉల్-ఆజ్హా) పవిత్ర పర్వదినాన్ని పురసరించుకుని ముస్లింలకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలియజేశారు.
ధనవంతులు, పేదలు అనే తరతమ బేధాలు లేకుండా, ప్రజల నడుమ శాంతి, సహనం, సౌభ్రాతృత్వాన్ని బక్రీద్ పెంపొందిస్తుందని కేసీఆర్ కొనియాడారు. ‘ఈ పవిత్ర దినాన.. ధార్మికత, దైవచింతన ప్రతి మానవుడి హృదయంలో విరజిమ్మాలి. గంగా జమున సంస్కృతికి ఆలవాలమైన తెలంగాణలో బక్రీద్ సందర్భంగా ప్రజల నడుమ సోదరభావం, ఐక్యత మరింత పెంపొందాలి’ అని కేసీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, తెలంగాణ రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.