KCR | హైదరాబాద్ : తెలంగాణ ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం, అన్నదాతలను ఇబ్బంది పెట్టడం చూస్తుంటే.. నాకు బాధేస్తుందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో కేసీఆర్ ఆవేదనతో మాట్లాడారు.
అవివేకం, అజ్ఞానం వల్ల పరిపాలన చేయడం రాక ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు. సర్వనాశనం చేశారు. ఆర్థిక పరిస్థితి ఎంత మంచిగా ఉండే.. కష్టపడి నోరు కట్టుకుని ఏడాదికి 15 వేల కోట్ల ఆదాయం పెంచాం. తెలంగాణను ఎట్ల తయారు చేశాం. ఇవాళ ఒక్క మాట ఆలోచించాలి. నా మనసు బాధ అయితుంది. ఇబ్బంది అవుతుంది.. తెలంగాణ నా కళ్ల ముందు ఇలా కావడం నాకు దుఃఖం కలిగిస్తుంది.. ఆవేదనతో చెబుతున్నా.. ఒక్క మాట ఆలోచన చేయండి.. బీఆర్ఎస్ హయాంలో భూముల ధరలు ఎలా ఉండే..? ఆనాడు కొనేటోళ్లు ఎక్కువ ఉండిరి.. అమ్మేటోల్లు తక్కువ ఉండిరి. ఇవాళ ఆపతికి అమ్ముదామంటే కొనేటోడు లేడు. భూముల ధరలు ఎక్కడికి పోయాయి. రైతులు కోటీశ్వరులమనే ధైర్యంతో ఉండే. ఒక్క ఏడాదిలోనే ఇంత గల్లంతు అయితదా..? కేసీఆర్ పక్కకు పోగానే ఇంత ఆగమైతదా.. అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంకో మాట అడుగుతున్నా.. సమైక్య రాష్ట్రంలో కరెంట్ బాధలు పడ్డాం. సీఎం అయ్యాక ఏడాదిన్నరలో చక్కగా చేసి 24 గంటల కరెంట్ ఇచ్చాం.. రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. కేసీఆర్ ఇచ్చిన కరెంట్ మీకు ఎందుకు ఇవ్వడం చేత కావడం లేదు. మళ్లీ ప్రజల గోస ఎందుకు పుచ్చుకుంటున్నారు. ఏం దౌర్భాగ్యం ఇది.. ఎటువంటి శని మనం నెత్తి మీద పెట్టుకున్నాం. మిషన్ భగీరథపై అసెంబ్లీలో నిలబడి నేను ఛాలెంజ్ చేశాను. ఐదేండ్లలో ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ ఎలక్షన్లలో నిలబడం.. ఓట్లు అడగడం అని చెప్పినం. ఇది దమ్మున్నోడే చెప్పాలి.. చేసి చూపించాం. కృష్ణా, గోదావరి నీళ్లు మీ ఇంటి ముందర దుంకించినం.. ఇప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వడం చేతనైత లేదు. కరెంట్ పోతది.. మంచినీళ్లు రావు.. వడ్లు కొనే దిక్కు లేదు. దళారీ, దోపిడీ వ్యవస్థకు రైతాంగం గురవుతుంది. 2104కు ముందు పరిస్థితిలు వస్తున్నాయి.. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత కాదా..? అని కేసీఆర్ ప్రశ్నించారు.