మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్‌రావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన ప్రజా సేవను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సుధాకర్‌రావు మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
డాక్టర్ సుధాకర్‌రావు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1969లో విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి జనగామలో అరెస్టు అయ్యారు. అనంతరం వైద్య విద్యను అభ్యసించి సామాన్య జనానికి వైద్య సేవలు అందించారు. ఎండోక్రైనాలజిస్టుగా పలు సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన సుధాకర్ రావు 1999లో పాలకుర్తి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2010లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్)లో చేరిన ఆయన.. 2014 నాటి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. చివరగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్‌గా పనిచేశారు. కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న సుధాకర్‌రావు ఇటీవల యశోద ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో ప్రాణాలు కోల్పోయారు. ఇక సుధాకర్‌రావు తండ్రి యెతి రాజారావు మంత్రిగా, తల్లి విమలాదేవి చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు.