ఏటూరునాగారం/భిక్కనూరు/నెల్లికుదురు, డిసెంబర్11: పోటాపోటీగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ములుగు జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీగా పేరొందిన ఏటూరునాగారంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి భారీ మెజారిటీ సాధించారు. కాకులమర్రి శ్రీలత ఏకంగా 3,230 ఓట్ల ఆధిక్యంతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీ పరిధిలో మొత్తం 8,333 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీలతకు 5,520 ఓట్లు, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి 2,330 ఓట్లు, బీజేపీ బలపరిచిన అభ్యర్థికి 64 ఓట్లు వచ్చాయి. కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామానికి చెందిన దేవనబోయిన శ్రీవాణీవాసుయాదవ్ 1,561 ఓట్ల భారీ మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించారు.
మండలంలోని మోటాటిపల్లి, ర్యాగట్లపల్లి, పెద్దమల్లారెడ్డి, సిద్ధరామేశ్వర్ నగర్, జంగంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి యాసం సంధ్య కాంగ్రెస్ అభ్యర్థిపై అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 1,731 ఓటర్లు ఉండగా 1,566 మంది ఓటు వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి యాసం సంధ్యకు 1,212 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థికి 260, బీజేపీ అభ్యర్థికి 54 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి యాసం సంధ్య కాంగ్రెస్ అభ్యర్థి జాగిరి వెంకటలక్ష్మిపై 952 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించింది. గ్రామంలోని 10 వార్డులకు 10 వార్డులు బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది