చిట్యాల, డిసెంబర్ 12 : మొదటి విడత పంచాయ తీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థికి ఓటువేసిన బ్యాలెట్ పేపర్లు శుక్రవారం మురుగుకాలువలో దర్శనమిచ్చాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిన్నకాపర్తిలో చోటుచేసుకున్నది. వందలాది బ్యాలెట్ పేపర్ల కట్టలు మురుగుకాలువలో, మరికొన్ని కౌంటింగ్ సెంటర్లో దర్శనమివ్వడం కలకలం రేపింది.
మండలంలోని చిన్నకాపర్తి పంచాయతీ ఎన్నికల్లో మొదటి నుంచీ బీఆర్ఎస్ అభ్యర్థి రుద్రారం భిక్షపతి గెలుపు ఏకపక్షమే అని ప్రచారం జరిగినా ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 451 ఓట్ల మెజారిటీ రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శుక్రవారం మురుగు కాలువలో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటువేసిన బ్యాలెట్ పేపర్లు దర్శనమివ్వడంతో కాంగ్రెస్ గెలుపునకు ఇదే కారణమంటూ గ్రామంలో అలజడి చెలరేగింది. దీంతో గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరి మురుగుకాల్వలో దర్శనమిచ్చిన బ్యాలెట్ పేపర్లను చూడగా, అన్నీ బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటువేసినవే ఉన్నాయి.
ఎన్నికలు నిర్వహించిన పాఠశాల ఆవరణలోకి, కౌంటింగ్ సెంటర్లోకి వెళ్లి పరిశీలించగా మరికొన్ని బ్యాలెట్ పేపర్లు, చింపివేసిన బ్యాలెట్ పేపర్లు లభించాయి. విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్‌రెడ్డి చిన్నకాపర్తికి వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అందోళనకు దిగగా, ఆర్డీవో అశోక్‌రెడ్డి వారితో చర్చలు జరిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఉన్న బ్యాలెట్ బాక్సులను అందరి సమక్షంలో సీజ్ చేసి సమస్యను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరోసారి కౌంటింగ్ చేసేలా చూస్తానని ఆర్డీవో తెలిపారు.
దేశమంతా ఓటు చోరీ జరిగిందని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఏకంగా బ్యాలెట్లనే చోరీ చేస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు హద్దు లేకుం డా పోయిందని, గతంలో అక్రమ ఓట్ల గురించి విన్నామని, ఇప్పుడు బ్యాలెట్లనే చోరీ చేసి గెలుపోటములను తారుమారు చేశారని పేర్కొన్నారు. చిన్నకాపర్తిలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలువాల్సి ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేలా చేశారని తెలిపారు.