Graduate MLC Bypoll | హైదరాబాద్/నల్లగొండ ప్రతినిధి, జూన్ 6 (నమస్తే తెలంగాణ): బుధవారం ప్రారంభమైన వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం ఉప ఎన్నికల లెక్కింపు కొనసాగుతున్నది. గురువారం రాత్రి తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఫలితం తేలలేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అయితే, ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వాస్తవ లెక్కలకు, నమోదు చేస్తున్న లెక్కలకు సరిపోలడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నది. కౌంటింగ్ టేబుల్ వద్ద ఓట్ల లెక్కింపునకు, ఆర్వో ప్రకటిస్తున్న ఓట్లకు తేడా ఉంటున్నదని, దానిని సరిచేయాలని ఈసీని కోరింది. ఈమేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి గురువారం రాత్రి బీఆర్కేఆర్భవన్కు వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థికి ప్రయోజనం కలిగే విధంగా కౌంటింగ్ అధికారులు లెక్కలు వేస్తున్నారని ఆరోపించారు.
ఓట్ల లెక్కింపులో జరుగుతున్న అవకతవకలపై ఆర్వో దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ప్రయత్నించినప్పటికీ, నాలుగు గంటలపాటు కనీస స్పందన లేదని మండిపడ్డారు. మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో 3వ రౌండ్ 4వ హాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 533 ఓట్ల మెజార్టీ వస్తే, ఆ ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థికి జమ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 3వ రౌండ్ 3వ హాల్లో తుది ఓట్ల లెక్కలు సరిపోలడంలేదని పేర్కొన్నారు. 4వ రౌండ్లోనూ వాస్తవ లెక్కలకు, నమోదు చేస్తున్న లెక్కలకు సరిపోలడంలేదని, వీటిపై వెంటనే రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీచేయాలని సీఈవోను కోరారు. బీఆర్ఎస్ ఏజెంట్ల సంతకాలు లేకుండా, అభ్యర్థికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, అభ్యర్థి, ఏజెంట్ల అభ్యంతరాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా లెక్కింపు చేస్తున్నారని కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తీరు గందరగోళానికి దారితీసింది. కౌంటింగ్ అధికారులు పారదర్శకత పాటించడం లేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు, ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి, ఆ పార్టీ ఏజెంట్లకు మాత్రమే ప్రాధాన్యమిస్త్తూ.. తమ అభ్యంతరాలను, అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని, తమ పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని పలువురు అభ్యర్థులు, ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ధర్మసమాజ్ పార్టీకి (డీఎస్పీ)కి చెందిన ఏజెంట్లు అధికారుల తీరును నిరసిస్తూ బుధవారం సాయంత్రం వాదనకు దిగారు. కౌంటింగ్ హాల్స్‌లో కాంగ్రెస్ పార్టీ మినహా మిగతా అభ్యర్థుల్లో ఎక్కువమంది తొలిరోజు అధికారుల తీరు సరిగా లేదని ఆరోపించారు. గురువారం సాయంత్రం బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ ఏజెంట్లతో కలిసి మీడియా ముందుకొచ్చారు. రాకేశ్‌రెడ్డి తన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ఆర్వోకు ఒక లేఖ అందజేసినట్టు తెలిసింది. ఇది జరుగుతున్న సమయంలో రిటర్నింగ్ అధికారి హరిచందన కౌంటింగ్ కేంద్రంలో అందుబాటులో లేరు. మరో మీటింగ్ ఉండటంతో బయటకు వెళ్లారని అక్కడ ఉన్న అధికారులు తెలిపారు.
అభ్యర్థుల అభిప్రాయాలు, అభ్యంతరాలను కనీసం పరిగణనలోకి తీసుకోకుండానే రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా మూడో రౌండ్ ఫలితాలు ప్రకటించారని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. మూడో రౌండ్ మూడో హాల్లో తమ లెక్కల ప్రకారం వెయ్యి ఓట్లను బీఆర్ఎస్కు జమ చేయాల్సి ఉన్నదని చెప్పారు. దీనిపై ఆర్వోను కలిసి తమ వాదన వినిపించేందుకు మూడు గంటలపాటు వేచి చూసినప్పటికీ తమకు సమయం ఇవ్వకుండా పోలీసులతో నెట్టివేయించారని ఆరోపించారు. టేబుళ్ల మీద కౌంటింగ్ పూర్తయ్యాక ఏజెంట్లతో సంతకాలు లేకుండానే ఫలితం ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తమ గెలుపును అడ్డుకునేందుకు ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మూడు రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థికి 17 వేల ఓట్ల మెజార్టీ మాత్రమే ఉండగా, దానిని 18 వేలకు పెంచి ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపించారు. ఓట్ల లెక్కింపులో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. కౌంటింగ్ టేబుళ్ల వద్ద కూడా కాంగ్రెస్ ఖాతాలో ఓట్లు జమయ్యేలా ఒత్తిళ్లు కనిపిస్తున్నాయని ఆరోపించారు. చిన్నచిన్న విషయాల పట్ల తాము సర్దుకుపోతున్నా, చివరకు ఫలితాల ప్రకటనలోనూ ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని కౌంటింగ్ పారదర్శకంగా జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.
వరంగల్-ఖమ్మంనల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నది. తొలి ప్రాధాన్యం ఓట్లలో ఫలితం తేలలేదు. తొలి ప్రాధాన్యం ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 18,565 ఓట్ల ఆధిక్యత కనబరిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ద్వితీయ స్థానంలో నిలిచారు. గెలుపు కోటాగా 1,55,095 ఓట్లను నిర్ధారించగా, తొలి ప్రాధాన్యంలో ఆ మార్క్‌ను ఎవరూ సాధించలేదు. దీంతో ద్వితీయ ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు కీలకంగా మారింది. తీన్మార్ మల్లన్న గెలుపొందాలంటే ఎలిమినేషన్ రౌండ్లో 32,282 ఓట్లు, రాకేశ్‌రెడ్డి గెలువాలంటే 50,847 ఓట్లు రావాల్సి ఉంటుంది. దీంతో చివరి అభ్యర్థి వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగవచ్చు. ఇదంతా పూర్తయి విజేత ఎవవో తేలాలంటే శుక్రవారం మధ్యాహ్నం వరకు సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సందర్భంగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డిపై తిప్పర్తి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో కౌంటింగ్ హాల్-2లో ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్వో వెంకటేశ్వర్లు వద్దకు వచ్చి బ్యాలెట్ పేపర్లు చూపించాలని భూపాల్‌రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో భూపాల్‌రెడ్డి తన విధులకు ఆటంకం కలిగించడంతోపాటు బెదిరింపు చర్యలకు పాల్పడ్డారని ఏఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కంచర్ల భూపాల్‌రెడ్డిపై తిప్పర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.
నల్లగొండ రూరల్, జూన్ 6: వరంగల్- ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపతంగా జరుగుతున్నదని రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఏజెంట్లు సంతకాలు చేసిన తరువాతే ఫలితాలు ప్రకటిస్తున్నామని చెప్పారు. నల్లగొండ జిల్లా అనిశెట్టి దుప్పలపల్లి వద్ద ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రంలో గురువారం రాత్రి ఆమె మీడియాకు వివరాలు వెల్లడించారు. రాత్రి 9 గంటల వరకు మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తయిందని చెప్పారు. మొత్తం 3,36,013 ఓట్లు పోలవగా.. అందులో 3,10,189 ఓట్లు చెల్లుబాటయ్యాయని, గెలుపు కోటా 1,55,095 ఓట్లు అని తెలిపారు. మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపులో తీన్మార్ మల్లన్నకు 1,22,813, రాకేశ్‌రెడ్డికి 1,04,248, ప్రేమేందర్‌రెడ్డికి 43,313, పాలకూరి అశోక్ కూమార్గౌడ్కు 29,697 ఓట్లు వచ్చాయని వివరించారు. గెలుపునకు అవసరమైన 1,55,095 ఓట్లు మొదటి ప్రాధాన్యంలో ఎవరికీ రాకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్లు లెక్కించనున్నట్టు తెలిపారు. 52 మంది అభ్యర్థుల్లో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రారంభిస్తామని తెలిపారు. చెల్ల ని ఓట్లు అధికంగా ఉండటం వల్ల కౌం టింగ్ ప్రక్రియ అలస్యమవుతున్నదని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ సీసీ టీవీల్లో రికార్డు అవుతున్నదని స్పష్టంచేశారు.
వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక తొలి ప్రాధాన్యం ఓట్లలో ప్రధాన అభ్యర్థులకు లభించిన ఓట్లు