ఇచ్చోడ/రాజాపేట/మంథని, డిసెంబర్ 11 : రాష్ట్రవ్యాప్తంగా గురువారం మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహించారు. అనంతరం చేపట్టిన ఓట్ల లెక్కింపులో ఫలితాలు ఉత్కంఠ రేపాయి. పలుచోట్ల పోటీచేసిన అభ్యర్థుల్లో ఇద్దరు సమానంగా ఓట్లు పొందడంతో విజేతలను నిర్ణయిచేందుకు అధికారులు డ్రాపద్ధతిని ఉపయోగించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం దాబా(బీ) గ్రామపంచాయతీలో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు సమానంగా 176 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు లక్కీడ్రా నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్‌ను సర్పంచ్‌గా ప్రకటించారు. యాదాద్రిభువనగిరి జిల్లా రాజాపేట మండలం లక్ష్మక్కపల్లి గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన ఎండ్ల రాజయ్యకు, కాంగ్రెస్ బలపరిచిన వేముల సురేందర్‌రెడ్డికి148 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో లక్కీడ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి ఇండ్ల రాజయ్యను అదృష్టం వరించింది. ఆయనను సర్పంచ్‌గా ప్రకటించారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లిలో కాంగ్రెస్ బలపర్చిన మెండ రాజయ్య, బీఆర్ఎస్ బలపర్చిన కనవేన కొమురయ్యకు సమానంగా 391 ఓట్లు రాగా, అధికారులు డ్రాతీసి కొమురయ్యను సర్పంచ్‌గా ప్రకటించారు.