కందుకూరు, డిసెంబర్ 17 : ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఖర్చుచేసి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో తాత్కాలిక డేరాలతో వేదిక ఏర్పాటుచేసి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. వాస్తవానికి గ్రీన్ఫార్మా సిటీ కోసం కేసీఆర్ ప్రభుత్వం సేకరించిన ఈ భూములను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫోర్త్‌సిటీ ఏర్పాటుకు వినియోగించుకుంటున్నది. ఫోర్త్‌సిటీలో రియల్ ఎస్టేట్ ప్రమోషన్ కోసం నిర్వహించాలని కోట్లు వెచ్చించి మీర్ఖాన్పేటలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో బుధవారం మూడో విడత స్థానిక పోరులో భాగంగా మీర్ఖాన్పేట గ్రామపంచాయతీలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి పరాభవం తప్పలేదు. ఈ వేదికపై గులాబీ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఘన విజయం సాధించారు. మొత్తం 1,793 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోగా.. బీఆర్ఎస్ బలపర్చిన నరేశ్‌కు 852 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నర్సింహకు 717 ఓట్లు వచ్చాయి. 135 ఓట్ల మెజారిటీతో నరేశ్ విజయం సాధించినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. నరేశ్‌కు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫోన్‌చేసి అభినందనలు తెలిపారు.
సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 17: ప్రజాపాలన కార్యక్రమంలో కాంగ్రెస్ సర్కార్ ఎంపిక చేసిన పైలట్ గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బాలసాని పరశురాములుగౌడ్ విజయం సాధించారు. పైలట్ గ్రామంలో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లతోపాటు ఇతర పథకాలు ప్రవేశపెట్టినా ప్రభావం చూపలేకపోవడం గమనార్హం. కేటీఆర్ చరిష్మా చెక్కు చెదరలేదని ఈ ఎన్నికలు నిరూపించాయని స్థానికులు చర్చించుకోవడం విశేషం. కాగా 2019లో తొలిసారి సర్పంచ్‌గా గెలిచిన పరశురాములుగౌడ్ రెండోసారి కూడా విజయం సాధించారు.
వరుసగా రెండోసా రి గెలవడం సంతోషంగా ఉన్నది. కేటీఆర్‌తోపాటు బీఆర్ఎస్ పై, నాపై నమ్మకంతో గ్రామస్థులు పట్టంకట్టారు. వారి నమ్మకానికి అనుగుణంగా పనిచేస్తా. పారదర్శకం గా పనిచేసి, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా. నా విజయానికి సహకరించిన గ్రామస్థులు, కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.